ఎన్నికల సామగ్రి రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచే ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేయాలి – కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రా లయోలా కాలేజీలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో ఎన్నికల సామగ్రి రిసెప్షన్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రి రిసెప్షన్ కేంద్రానికి చేరుకున్న అనంతరం చేపట్టాల్సిన చర్యలు, స్ట్రాంగ్ రూమ్‌లలో సామగ్రిని భద్రపరిచే విధానంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల సామగ్రి రిసెప్షన్ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ముగ్గురు అదనపు కమిషనర్లకు మూడు నియోజకవర్గాల బాధ్యతలను కేటాయించి, వారి పర్యవేక్షణలో జోనల్ అధికారులు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సర్కిల్ పరిధిలోని అధికారులు సంబంధిత రిటర్నింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చే ఎన్నికల సామగ్రిని నిర్దేశిత విధానంలో స్వీకరించి స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రిసెప్షన్ ప్రక్రియలో ప్రతి దశను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎన్నికల సామగ్రి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఈ. రవీంద్రరావు, డాక్టర్ డి. చంద్రశేఖర్, కె. శకుంతల, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, అసిస్టెంట్ కమిషనర్ ప్రభావతి, సీడీవోలు శ్రీకాంత్, జగదీశ్వరి, ఉమామహేశ్వరి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.