-వ్యక్తిగత ఆర్థిక సాయం కింద బాలిక కుటుంబానికి రూ.లక్ష అందించిన మంత్రి సత్యకుమార్
-చికిత్సకు స్పందిస్తున్న బాధితురాలు
-వైద్యుల కృషికి మంత్రి అభినందనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక గోపికకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తరఫున తక్షణ అవసరాల కింద రూ.2 లక్షలు విడుదల చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అనంతపురం సర్వజన ఆసుపత్రి వైద్యశాల అభివృద్ధి నిధి నుంచి సోమవారం బ్యాంకు ద్వారా ఈ మొత్తాన్ని బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి యాజమాన్యానికి చెల్లించారు. దీనికి ముందుగానే మంత్రి సత్యకుమార్ యాదవ్ తన వ్యక్తిగత ఆర్థిక సాయం కింద రూ.లక్షను గోపిక కుటుంబానికి అందించారు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలిక ఆరోగ్యం మెరుగైన వైద్యంతో క్రమంగా కుదుటపడుతోంది.
ఘటన జరిగిన రోజు అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితిని చూసి మంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఉన్మాది క్రూర దాడిలో తీవ్ర రక్తగాయాలతో తొలుత అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చేరిన గోపికకు అక్కడి వైద్యులు వేగంగా స్పందించి చికిత్స అందించారు. దీంతో బాలిక ఆరోగ్యం మరింత విషమించకుండా నిలువరించగలిగారు. మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు వైద్యులు గోపిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన ఎనిమిది ప్యాకెట్ల రక్తాన్ని ఎక్కించారు. రక్తస్రావం జరుగుతున్న సమయంలోనే మత్తు ఇచ్చి తీవ్ర గాయాలకు చికిత్స అందించారు. అనంతపురం నుంచి బాలికను త్వరగా బెంగళూరుకు తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవ చూపారు. అక్కడి వైద్యులతో నిరంతరం మాట్లాడి చికిత్స వేగంగా అందేలా కృషి చేశారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండటంతో గోపిక రక్తపోటు క్రమంగా అదుపులోకి వచ్చింది. ఆదివారం వరకు రక్తపోటు నియంత్రణకు రెండు మందులు ఇవ్వగా, బాలిక స్పందించడంతో రాత్రికి ఒక మందును నిలిపివేశారు. మూత్ర విసర్జన వ్యవస్థ మెరుగుపడింది. రక్త పరీక్షల్లో మూత్రపిండాల పనితీరు సాధారణ స్థాయిలో ఉన్నట్లు సోమవారం వైద్యులు తెలిపారు.
వైద్య బృందానికి మంత్రి అభినందనలు
బెంగళూరులో గోపికకు చికిత్స అందిస్తున్న డాక్టర్ మయూర్ శెట్టి, డాక్టర్ లాల్‌చంద్, డాక్టర్ శిజ్జు, డాక్టర్ కౌశిక్, డాక్టర్ రవికిరణ్‌తో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. గోపిక ఆరోగ్యం మెరుగుపడేందుకు వారు చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు.
బాలికకు తక్షణ చికిత్స అందించడంలో వేగంగా స్పందించిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ హరికృష్ణ, మహేష్, సాంకేతిక నిపుణుడు గౌస్‌లను మంత్రి అభినందించారు. విధుల నిర్వహణలో వారు చూపిన చొరవను గుర్తిస్తూ వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎ. విష్ణువర్ధన్ ప్రశంసా లేఖలు పంపించారు.
