-తన హింసావాదానికి ప్రజలు స్పందించలేదని నిరసనగానా?
-మిగిలిన 91 పురపాలక ఎన్నికలు సవ్యంగా జరిగాయని అంగీకరించిన వైనం
-పులివెందులలో 71 శాతం, కడప జిల్లాలో 70 శాతం పైగా పోలింగ్ ప్రజల స్వేచ్ఛకు చిహ్నం కాదా?
-‘పుర’ పోరు ప్రశాంతంగా జరగడాన్ని జీర్ణించుకోలేని జగన్‌రెడ్డి
-ఎన్నికల యంత్రాంగం, పోలీసులకు, అధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆదివారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా 13 మునిసపల్ కార్పొరేషన్లు, 79 మునిసిపాలిటీలు, నగరపాలక పంచాయతీలకు ప్రశాంతంగా పోలింగ్ జరగడంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం వెలిబుచ్చారు. ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు, సంబంధిత అధికారులను మంత్రి సోమవారంనాడు ఒక ప్రకటనలో అభినందించారు.
నీరుగారిన జగన్ రెడ్డి కలలు-తిరగబడిన జిల్లా ప్రజలు
పురపాలక ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలను రెచ్చగొట్టి అనివార్యమైన తన ఓటమికి సాకులు చూపే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కుట్ర పూర్తిగా విఫలమైందని మంత్రి అన్నారు. ఆదివారంనాటి పోలింగ్‌లో పులివెందులలో 71 శాతం, కడప కార్పొరేషన్లో 70 శాతం పోలింగ్ తో పాటు కాడప జిల్లా వ్యాప్తంగా 70 శాతానికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రస్తుత ఎన్నికలు జగన్ ఆశయాలకు భిన్నంగా స్వేచ్ఛా వాతావరణంలో జరిగాయనడానికి నిదర్శనమని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ మూడు చోట్ల జరిగిన పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ లో అగ్రభాగాన ఉండడం ప్రత్యేకంగా గమనార్హమని, ఈ స్థాయిలో జరిగిన పోలింగ్ జిల్లాలో దశాబ్దాలుగా వైయస్సార్ కుటుంబ నిరంకుశ ధోరణిపై జిల్లా ప్రజల తిరుగుబాటుకు చిహ్నమని, ఇకనైనా జగన్‌రెడ్డి తన ధోరణిని మార్చుకోవాలని మంత్రి హితవు పలికారు.
ఓటు వేయకుండా సెల్ఫ్ గోల్ చేసుకున్న జగన్‌రెడ్డి
ప్రజాస్వామ్యంలో అతి పవిత్రమైన, రాజ్యాంగ ప్రసాదితమైన ఓటు హక్కును స్వస్థలం పులివెందులలో వినియోగించుకోకుండా మాజీ సీఎం సెల్ఫ్ గోల్ చేసుకున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తన…రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడికి అనుగుణంగా ఉందని మంత్రి అన్నారు. ఓటు వేయకపోవడానికి సంబంధించిన పలు ప్రశ్నలకు జగన్ సమాధానమివ్వాలని మంత్రి డిమాండ్ చేశారు.
పులివెందులలో ఎన్నికలు జరిగిన తీరుకు నిరసనగా తాను ఓటు వేయలేదని చెప్పుకున్న జగన్‌రెడ్డి…మిగిలిన 91 పురపాలక సంస్థలకు ఎన్నికలు సవ్యంగా జరిగాయని అంగీకరించినట్లయ్యిందని మంత్రి వ్యాఖ్యానించారు.
మీడియా ముందు చొక్కా మడిచి పోలింగ్ నాడు పులివెందులలోనే ఉంటాను ఎవరొస్తారో రండి అంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన జగన్ ప్రశాంత వాతావరణంలో జరిగిన ఓటింగ్ సరళితో మైండ్ బ్లాక్ అయి నానా డ్రామాలకు దిగజారారని మంత్రి సత్యకుమార్ యాదవ్ దుయ్యబట్టారు. తాను హింసకు పిలుపునిచ్చినా పులివెందుల ప్రజలు దాన్ని తిరస్కరించినందుకు నిరసనగా ఓటు వేయకపోవడం సబబా అని జగన్‌రెడ్డిని మంత్రి నిలదీశారు.
తాను చెప్పిన సమయానికి కాకుండా ముందుగానే హెలికాప్టర్ లో వచ్చి తాను దిగడానికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిదని, నియమాల ప్రకారం జారీ అయిన పోలింగ్ ఏజెంట్ల రిలీవింగ్ ఆర్డర్లను చూపిస్తూ 70 చోట్ల తమ ఎన్నికల ఏజెంట్లు లేకుండా చేశారని అసత్యపు ఆరోపణలకు దిగజారి మీడియా ముందు నానా యాగీ చేసి తన ఓటమికి కారణాలు చూపే విఫల ప్రయత్నం చేశారని, ఇది హాస్యాస్పదమని, దీన్ని ప్రజలు గమనించారని మంత్రి వ్యాఖ్యానించారు. పలు చోట్ల రౌడీ షీటర్లను వైసీపీ ఎన్నికల ఏజెంట్లుగా నియమించడంతో వారంతా తిరస్కరణకు గురైనట్టు వచ్చిన వార్తలు తనకు దిగ్భ్రాంతిని కలిగించాయని మంత్రి అన్నారు.
జగన్‌రెడ్డి అసంబద్ధ నిరసన
తాను ఓటు వేస్తే అంతా సవ్యంగా జరిగిందని ప్రజలు అనుకుంటారు కనుక తాను ఓటు వేయలేదని జగన్‌రెడ్డి ఇచ్చిన వివరణ పూర్తి అసంబద్ధంగానూ, అపహాస్యంగానూ ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. అట్టి నిరసన కేవలం తనకు ఓటు ఉన్న బాకరాపురం బూత్‌కే పరిమితమా లేక పులివెందులతో పాటు రాష్ట్రానికి అన్వయిస్తుందా అనే ప్రశ్నకు జగన్‌రెడ్డి సమాధానం ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. తాను చేసిన పని రాష్ట్ర స్థాయి నిరసన అయితే… ఆదివారంనాడు 60 శాతానికి పైగా జరిగిన పోలింగ్‌లో వైసీపీ మద్దతుదారులు ఎవరూ ఓటు వేయలేదా అని జగన్‌ను మంత్రి ప్రశ్నించారు. ప్రశాంత ఎన్నికలపై విశ్వాసం లేకుంటే వైసీపీ అభ్యర్థులను, మద్దతుదారులను ఎన్నికలను బహిష్కరించాలని జగన్‌రెడ్డి ఎందుకు పిలుపు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు.
నవ్వులపాలైన జగన్‌రెడ్డి
స్థానిక ఎన్నికల ప్రకటన వెలువడినప్పట్నించి తన అసంబద్ద, అనుచిత వ్యాఖ్యలు, చేతలతో జగన్‌రెడ్డి ప్రజల్లో నవ్వులపాలయ్యారని, వైసీసీ నాయకులు, మద్దతుదారులు కూడా జగన్ ధోరణితో తలలు పట్టుకుంటున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇకనైనా రాజకీయ పరిణితి, ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్ వ్యవహరించాలని మంత్రి హితవు పలికారు.
అధికార యంత్రాంగానికి మంత్రి అభినందనలు
ఆదివారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా పులపాలక పోరులో జరిగిన ఓటింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీ, పోలీసు యంత్రాంగం, పలు బాధ్యతలు నిర్వహించిన ఇతర అధికారులు, సిబ్బందిని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలను నిర్వహించి కూటమి ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపచేయాలని మంత్రి కోరారు.
