Breaking News

పర్యాటక ప్రాంతాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలి…

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ది, మౌలిక వసతుల కల్పన పనులను వేగంవంతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలోని తమ ఛాంబరులో పర్యాటక, క్రీడా శాఖల అధికారులతో మంత్రి సమావేశమై శాఖల వారీగా నిర్వహిస్తున్న పనుల ప్రగతిని సమీక్షించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్దికై పెట్టుబడుల ఆకర్షణ, నిధుల సమీకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్దిలో భాగంగా విజయవాడలోని భవాని ఐలాండ్ పార్క్ ఆధునికీకరణ, మౌలిక సదుపాయాల కల్పన పనులను చేపట్టాలన్నారు. బెరమ్ పార్క్ వద్ద రూ. 2.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఫ్లోటింగ్ జెట్టీల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. లంబసింగిలో కాటేజీ నిర్మాణ పనులను ఈ నెల 16, 17 తేదీల కల్లా పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మారేడుమిల్లిలో ఉన్న కాటేజీల ఆధునీకరణ పనులను రూ.5 కోట్లతో చేపట్టాలని ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జన్మించిన పాండ్రంగి, ఆయన సమాధి ఉన్న కేడీపేటల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విశాఖ జిల్లా తొట్లకొండపై నిర్మించిన బౌద్ద స్తూపం వద్ద పర్యాటకుల కోసం రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలన్నారు.

ఏ.పి.సి.ఎమ్.కప్ టోర్నమెంట్స్…
యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించడానికి, ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి వారికి తగిన శిక్షణ నిచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశింపబడిన ఏ.పి. సి.ఎమ్. కప్ టోర్నమెంట్స్ ను దశల వారీగా అన్ని జిల్లాలలో నిర్వహించాలని క్రీడా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ టోర్నమెంట్స్ లో భాగంగా వాలీబాల్, కోకో, అథ్లెటిక్స్ తదితర క్రీడా పోటీలను నిర్వహించాలన్నారు. ఈ నెల 20 నుండి వరుసగా మూడు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ టోర్నమెంట్స్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోనున్న 14 స్టేడియంలలో తొలిదశలో కనీసం నాలుగు స్టేడియంలను అయినా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్దిపర్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్టా- గుంటూరు, రాయలసీమ తదితర ప్రాంతాల్లో ఈ నాలుగు స్టేడియంలను గుర్తించి నవంబరు 1 కల్లా పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
నూతన క్రీడా పాలసీ ముసాయిదా ప్రతిపాదలను శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రభాకరరెడి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా మంత్రి కి వివరించారు. ఈ ముసాయిదా ప్రతిపాదనలలో కొన్ని మార్పులు, చేర్పులను మంత్రి సూచించారు.
రాష్ట్ర అధికార భాష సంఘం అద్యక్షుడు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ ఆరిమండ వర ప్రసాద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సి.ఇ.ఓ. ఎస్.సత్యనారాయణ, ఈడీ మల్ రెడ్డి, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, కీడా శాఖ అధికారులు రామకృష్ణ, ఎస్.వి.రమణ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *