మురసు తుపానుపై ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ

– కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
– ఒంగోలు సమీపంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున తీరం దాటే అవకాశం
– 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలి
– ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి..
– హోంమంత్రి అనిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మురసు తీవ్ర తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తోందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత తెలిపారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇవాళ రాత్రి , రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించిన నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. తుపాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

విద్యుత్, సమాచార వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి

బలమైన గాలుల కారణంగా విద్యుత్ లైన్లపై చెట్లు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ముందుగానే వాటిని తొలగించాలని మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా, మొబైల్ నెట్‌వర్క్ సేవల్లో అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెగిపడిన వైర్లను తాకకుండా దూరంగా ఉండాలని హెచ్చరించారు. ప్రమాదకర పరిస్థితులు కనిపించినా, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి

తుపాను ప్రభావం దృష్ట్యా మత్స్యకారులను ముందుగానే అప్రమత్తం చేయాలని మంత్రి ఆదేశించారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా తగిన హెచ్చరికలు జారీ చేయడంతోపాటు, ఇప్పటికే ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులు తమ పడవలు, వలలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలని, అవసరమైన చోట్ల సహాయక చర్యలకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు.

48 గంటల పాటు హై అలర్ట్

రానున్న 48 గంటల పాటు అధికార యంత్రాంగం హై అలర్ట్‌లో ఉండాలని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలకు అవసరమైన సహాయాన్ని వేగంగా అందించాలని అధికారులను ఆదేశించారు.

అధికారిక హెచ్చరికలు పాటించాలి

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సమన్వయంతో తుపాను కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రజలు అధికారికంగా జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే నిర్ధారణ లేని సమాచారాన్ని, వదంతులను నమ్మవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరారు. తుపాను సంబంధిత సమస్యలపై తక్షణ సహాయం కోసం మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. అత్యవసర సహాయం అవసరమైనవారు విపత్తుల నిర్వహణ సంస్థకు చెందిన 112, 1070, 18004250101 నంబర్లకు ఫోన్ చేయాలని హోంమంత్రి అనిత సూచించారు. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యమని, తుపాను ప్రభావం తగ్గే వరకు అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని స్పష్టం చేశారు.