5 వేల మందికి పైగా విద్యుత్‌ ఉద్యోగులతో మంత్రి గొట్టిపాటి టెలీకాన్ఫరెన్స్‌

-‘మురసు’ను ఎదుర్కొనేందుకు విద్యుత్‌ శాఖ సర్వసన్నద్ధం
-గరిష్ఠంగా 120 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం.. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి
-ఆసుపత్రులు, అత్యవసర సేవలకు విద్యుత్‌ అంతరాయం లేకుండా జనరేటర్‌ బ్యాకప్‌
-ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సిబ్బందికి వసతి, భోజన సదుపాయాలు కల్పించాలి
-సిబ్బంది భద్రతకు తొలి ప్రాధాన్యం.. తుపాను తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ‘మురసు’ తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విద్యుత్‌ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఏపీసీపీడీసీఎల్‌ పరిధిలో తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ, ఆ సంస్థ పరిధిలోని సీఎండీ నుంచి క్షేత్రస్థాయి లైన్‌మెన్‌ వరకు 5 వేల మందికి పైగా ఉద్యోగులతో సోమవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను సన్నద్ధత, విద్యుత్‌ వ్యవస్థ రక్షణ, ప్రజలకు అవగాహన, పునరుద్ధరణ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

గత అనుభవాలతో పటిష్ఠ కార్యాచరణ

గతంలో అర్ణబ్‌ తుపాను సమయంలో ఎదురైన సమస్యలను సమీక్షించి, అవి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లకు జరిగే నష్టాన్ని ముందుగానే అంచనా వేయాలని చెప్పారు. అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, మరమ్మతు పరికరాలు, వాహనాలు, యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. తుపాను తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి విద్యుత్‌ డివిజన్‌ పరిధిలో ప్రత్యేక కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసి, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తుపాను ప్రభావం తగ్గిన వెంటనే సురక్షిత పరిస్థితులను అంచనా వేసి, క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.

ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి
తుపాను సమయంలో విద్యుత్‌ ప్రమాదాల నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. మీడియా, సిటీ కేబుల్‌, సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేయడంతో పాటు ప్రతి విద్యుత్‌ ఉద్యోగి తన వాట్సాప్‌ స్టేటస్‌లోనూ భద్రతా సూచనలు ఉంచాలని కోరారు. స్థానిక సోషల్‌ మీడియా గ్రూపుల్లోనూ సమాచారాన్ని విస్తృతంగా పంచుకోవాలన్నారు. తెగిపడిన విద్యుత్‌ తీగలను తాకరాదని, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం అందించేలా ప్రచారం చేయాలన్నారు.

ఉద్యోగుల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం
విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహించే విద్యుత్‌ సిబ్బంది భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు సేవలు అందించడం ఎంత ముఖ్యమో, అదే సమయంలో ఉద్యోగులు తమ ప్రాణాలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణంలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా విధులు నిర్వహించరాదన్నారు. రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచుకుని, సురక్షిత పరిస్థితులు నిర్ధారించిన తర్వాతే మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు.

ఆసుపత్రులకు జనరేటర్‌ బ్యాకప్‌
తుపాను సమయంలో ఆసుపత్రులు, ఇతర అత్యవసర సేవలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన చోట జనరేటర్‌ బ్యాకప్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రజారోగ్యం, రెవెన్యూ, విద్యుత్‌ శాఖలు సమన్వయంతో పనిచేస్తే తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల సిబ్బందికి ప్రత్యేక ఏర్పాట్లు
పునరుద్ధరణ పనుల కోసం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యుత్‌ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, నాణ్యమైన భోజనం, తాగునీరు, రవాణా సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు. ఇందుకోసం ముందుగానే స్థానికంగా అందుబాటులో ఉన్న కల్యాణ మండపాలను గుర్తించి సిద్ధం చేసుకోవాలని అధికారులకు తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ప్రజల భద్రత, విద్యుత్‌ ఉద్యోగుల సంక్షేమం, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు.