“మురసు” తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీసీపీడీసీఎల్ అప్రమత్తం

-తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: సీఎండీ పి. పుల్లారెడ్డి
-ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లు, డివిజన్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన “మురసు” తుఫాన్ ప్రభావంతో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థ సన్నద్ధతపై సీఎండీ పి. పుల్లారెడ్డి అన్ని జిల్లాల విద్యుత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు దెబ్బతినే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సందర్భాల్లో సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించేందుకు అవసరమైన సిబ్బంది, వాహనాలు, మరమ్మతు పరికరాలు, విద్యుత్ సామగ్రిని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
తుఫాన్ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిల్, డివిజన్ స్థాయిలలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు సీఎండీ వెల్లడించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గి, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు విద్యుత్ ఉద్యోగులెవరూ సెలవులు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టేలా సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తుఫాన్ సమయంలో తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ ప్రమాదాలు లేదా సరఫరా అంతరాయాలకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఏపీసీపీడీసీఎల్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు
తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ సరఫరా అంతరాయాలు, అత్యవసర సమస్యలు, విద్యుత్ ప్రమాదాల సమాచారాన్ని తెలియజేసేందుకు జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేశారు.
కృష్ణ జిల్లా: 6281709355
ఎన్టీఆర్ జిల్లా: 9440817561
బాపట్ల జిల్లా: 9281413774
గుంటూరు జిల్లా: 9440817526
ప్రకాశం జిల్లా: 9440817491
పల్నాడు జిల్లా: 7661019447
అత్యవసర విద్యుత్ సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్: 1912
తుఫాన్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ ప్రమాదాలు సంభవించే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే 1912 లేదా సంబంధిత జిల్లా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ విజ్ఞప్తి చేశారు.