-అర్నబ్ తుఫాను నష్టంపై కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు
-4 జిల్లాల పర్యటన వివరాలు వెల్లడించిన కేంద్ర బృందం సభ్యులు
-రాష్ట్ర ప్రభుత్వ తక్షణ స్పందన, సహాయక-పునరుద్ధరణ చర్యలపై ప్రశంసలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లడంతో, కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర బృందానికి వెల్లడించారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.4,526 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, దీనికి సంబంధించిన నివేదికను ఇప్పటికే కేంద్రానికి సమర్పించామని చెప్పారు. తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సోమవారం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. కేంద్ర హోం, వ్యవసాయం, జల వనరులు, జాతీయ రహదారులు, ఆర్థిక విభాగాలకు చెందిన అధికారులు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదిక సమర్పించిన వెంటనే… నష్టం అంచనాకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించడంపై ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సమగ్రంగా పరిశీలించి, త్వరితగతిన సిఫార్సులు సమర్పించాలని కోరారు. కేంద్రం నుంచి సత్వర ఆర్థిక సాయం అందితే రాష్ట్రానికి ఎంతో ఊరట కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అర్నబ్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు కోనసీమ, పశ్చిమగోదావరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించిన విషయాన్ని కేంద్ర బృందం సభ్యులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ జిల్లాల్లో తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు కేంద్ర బృందం అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తుఫాను ప్రభావంతో వరి, కొబ్బరి, అరటి వంటి పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు కేంద్ర బృందం గుర్తించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించింది. ముఖ్యంగా పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను తీవ్రత కారణంగా రైతులకు నష్టం మరింత పెరిగిందని బృందం సభ్యులు తెలిపారు.
ఓవైపు కరువు…మరోవైపు తుఫాన్లు
వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన, ఆక్వా కల్చర్ వంటి వాణిజ్య పంటలు కూడా దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. మత్స్యకారుల పడవలకు సైతం నష్టం వాటిల్లిందన్నారు. అర్నబ్ తుఫాను మిగిల్చిన నష్టం నుంచి ఇంకా కోలుకోకముందే మురసు తుఫాను రాష్ట్రాన్ని తాకుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. హుద్ హుద్, తిత్లీ, మోంథా వంటి తుఫాన్లు గతంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టాన్ని కలిగించాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఒక ప్రాంతం ఎల్‌నినో వల్ల తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటుండగా, మరో ప్రాంతం తుఫాన్ల ప్రభావానికి గురవుతోందన్నారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకే ఉద్యాన పంటల వైపు మళ్లుతున్నామని… అలాగే తుఫాన్లను ఎదుర్కొనేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నామని సీఎం చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంతో పాటు వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను అనుసంధానం చేయడం ద్వారా తుఫాను సమయంలో ప్రాణనష్టాన్ని భారీగా తగ్గించగలిగామని ముఖ్యమంత్రి కేంద్ర బృందానికి వివరించారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో ఆర్టీజీఎస్, వాట్సాప్ మనమిత్ర కీలకంగా వ్యవహరించాయని కేంద్ర బృందం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ఈ ఉత్తమ విధానాలను ఇతర రాష్ట్రాలకు కూడా సిఫార్సు చేస్తామని కేంద్ర బృందం తెలిపింది.
పునరుద్ధరణ చర్యలపై నిరంతర పర్యవేక్షణ
తుఫాను కారణంగా విద్యుత్, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం 7 వేల మంది సిబ్బందితో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టినట్లు వెల్లడించారు. పునరావాసం, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులను ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు, సహాయక చర్యలు-పునరుద్ధరణ పనులకు చేసిన కృషిని కేంద్ర బృందం ప్రశంసించింది. ముఖ్యంగా విద్యుత్, రహదారుల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొంది. మారుమూల ప్రాంతాల్లో సైతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించింది.
