-నల్లజర్లలో 125 ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ ప్రారంభించిన కలెక్టర్ కీర్తి చేకూరి
నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. నల్లజర్ల గ్రామంలో 125 ఎకరాల్లో వరి సాగు నుండి పామాయిల్ సాగుకు పంట మార్పిడి కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం సాయంత్రం పామాయిల్ మొక్క నాటి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4 వేల హెక్టార్లలో పామాయిల్ సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ముఖ్యంగా నల్లజర్ల, దేవరపల్లి మండలాలు పామాయిల్ సాగుకు అనుకూల ప్రాంతాలని తెలిపారు. నల్లజర్ల గ్రామ రైతులు సమిష్టిగా 125 ఎకరాల్లో ఒక బ్లాక్‌గా ఏర్పడి వరి నుండి పామాయిల్ సాగుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. పామాయిల్ సాగులో ప్రారంభ నాలుగేళ్లలో ప్రధాన దిగుబడి రాకపోయినా, రైతులు మిశ్రమ పంటల సాగు ద్వారా ఆదాయం పొందవచ్చని కలెక్టర్ వివరించారు. పామాయిల్ సాగు ప్రాంతానికి రహదారి సౌకర్యం లేదని రైతులు తెలియజేయగా, రోడ్డు ఏర్పాటుకు ఆయిల్ కంపెనీ లేదా ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పామాయిల్ హార్వెస్టింగ్ సమయంలో విద్యుత్ షాక్ ప్రమాదాలు జరగకుండా ఇన్సులేషన్ కలిగిన పోల్స్ మాత్రమే వినియోగించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రారంభంలో దిగుబడి కొంత తగ్గినా, ఎరువులు మరియు పురుగుమందుల ఖర్చులు తగ్గి రైతులకు మిగులు ఆదాయం లభిస్తుందని చెప్పారు. ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని పేర్కొంటూ రైతులు సహజ సాగు పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు.
జిల్లా హార్టికల్చర్ అధికారి మల్లికార్జున రావు మాట్లాడుతూ కొవ్వూరు డివిజన్ పరిధిలోని నల్లజర్ల, దేవరపల్లి, చాగల్లు, నిడదవోలు మండలాల్లో 9 బ్లాక్‌లలో సుమారు 525 ఎకరాల్లో పామాయిల్ సాగుకు రైతులు ముందుకు వచ్చినట్లు తెలిపారు. రైతులకు సాంకేతిక సహాయం అందించడంతో పాటు పంట కోత అనంతరం కంపెనీ ద్వారా దిగుబడిని కొనుగోలు చేసే ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు NMEOP పథకం కింద సబ్సిడీ అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ముగ్గురు లబ్ధిదార రైతులకు యూనిట్లను కలెక్టర్ కీర్తి చేకూరి అందజేశారు.
రైతులతో సమావేశం అనంతరం కలెక్టర్ పామాయిల్ మొక్క నాటి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ. దుర్గేష్, జిల్లా ఉద్యాన అధికారి ఎన్. మల్లికార్జున రావు, త్రీ ఎఫ్ పామ్ ఆయిల్ కంపెనీ జీఎం విజయప్రసాద్, ఏరియా మేనేజర్ సూర్యారావు, రైతులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News