మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
కూటమి ప్రభుత్వ 27 నెలల సుపరిపాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ద్వారా మద్దతు తెలిపారని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 83 మున్సిపాలిటీల్లో ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని తెలిపారు.
గత 27 నెలల్లో సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని, పెన్షన్ల పెంపు, స్త్రీశక్తి, తల్లికి వందనం, అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు ప్రయోజనం కల్పించామని వివరించారు. పట్టణాల అభివృద్ధికి రూ.50 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించి పనులు చేపడుతున్నామని చెప్పారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
2021లో వైసీపీ పాలనలో జరిగిన స్థానిక ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని పేర్కొంటూ, ఈవీఎంలైనా, బ్యాలెట్ పేపర్లయినా ప్రజల తీర్పు కూటమికి అనుకూలంగానే ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కూటమి ఇదే తరహా ఫలితాలు సాధిస్తుందని బొండా ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.
