లోతట్టు ప్రాంతాలు మరియు కొండవాలు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
లోతట్టు ప్రాంతాలు మరియు కొండవాలు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం సాయంత్రం మురుసు తుఫాను నేపథ్యంలో నగరంలో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏపీఐఐసీ కాలనీ, భారతి నగర్, శ్రీనివాస నగర్, బ్యాంక్ కాలనీ, వంటకాలవ రోడ్డు, బి.ఆర్.టి.ఎస్. రోడ్డు, సింగ్ నగర్ పైపుల రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి, తుఫాను ప్రభావంతో ఏర్పడిన నీటి నిల్వలు, వాటి తొలగింపునకు అధికారులు చేపడుతున్న చర్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని రహదారులపై నీటి నిల్వలు ఏర్పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న మోటార్లకు అదనంగా రెట్టింపు సంఖ్యలో ఆయిల్ మోటార్లను ఏర్పాటు చేసి, రహదారులపై నిలిచిన నీటిని వేగవంతంగా తొలగించాలని సూచించారు. పంట కాలువ రోడ్డులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, తేలియాడే వ్యర్థాలు, గుర్రపుడెక్కలను పూర్తిస్థాయిలో తొలగిస్తూ డీసిల్టింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు.

అనంతరం బి.ఆర్.టి.ఎస్. రోడ్డులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు. తదుపరి సింగ్ నగర్ పైపుల రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో పర్యటించి బుడమేరు ప్రవాహ పరిస్థితులను సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ రహదారులపై నీటి తొలగింపు చర్యలను వేగవంతం చేయడంతో పాటు, ప్రధాన అవుట్‌ఫాల్ డ్రైన్లలో పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలు, గుర్రపుడెక్కలను తొలగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాలు, ముఖ్యంగా బుడమేరు పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజినీర్ పి. సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు గోపాలకృష్ణమూర్తి, రామారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.