సుస్థిర ఆహార విధానాలతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి

-బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవం–2026లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవం–2026లో భాగంగా “సుస్థిర ఆహార విధానాలను అలవర్చుకోవడం” (Adopt Sustainable Food Systems) అనే థీమ్‌తో మెప్మా–విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం న్యూ రాజీవ్ నగర్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆహార వ్యర్థాల తగ్గింపు, సుస్థిర ఆహార విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తల ద్వారా చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార ఉత్పత్తుల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించారు. ఆహార వృథాను అరికట్టడం, వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని ప్రదర్శించి అవగాహన కల్పించారు. ప్యాకేజ్డ్, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించి, పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సుస్థిర జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

సుస్థిర ఆహార విధానాలను పాటించడం ద్వారా ఆరోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ సంరక్షణకు కూడా దోహదపడుతుందని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సి.డి.ఓ–2 జగదీశ్వరి, సి.ఎల్.ఆర్.పి. సయ్యద్ జమీలా, పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.