Breaking News

మ‌హిళా సంఘాల రుణాల‌పై ప్రాసెస్‌, ఇన్‌స్పెక్ష‌న్ చార్జీలు ర‌ద్దుచేసిన యూనియ‌న్ బ్యాంక్‌

-ప్ర‌తి సంఘానికి మూడేళ్ల‌లో రు.93,500 మేర‌ ఆర్థిక లబ్ధి
-1.75 ల‌క్ష‌ల సంఘాల‌కు సంవత్స‌రానికి 586.25 కోట్ల ల‌బ్ధి
-మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభ‌వార్త‌. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (SHGs) మహిళల ఆర్థిక సాధికారత దిశగా మరో కీలక ముందడుగు పడింది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల‌తో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ & సెర్ప్ అధికారుల స‌మ‌న్వ‌యంతో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశాల్లో చేసిన విజ్ఞప్తుల ఫలితంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసే రుణాలపై విధించే ప్రాసెసింగ్ చార్జీలు, ఇన్‌స్పెక్షన్ చార్జీలను పూర్తిగా మినహాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ.10 లక్షలకు పైబడిన క్యాష్ క్రెడిట్ (CC) రుణాలపై ప్రతి లక్షకు రూ.350 చొప్పున ప్రాసెసింగ్ చార్జీ, రూ.5 లక్షలకు పైబడిన టర్మ్ లోన్ (TL) రుణాలపై 1.30 శాతం ప్రాసెసింగ్ చార్జీ విధించేవారు. అదనంగా రూ.5 లక్షలకు పైబడిన ప్రతి రుణ ఖాతాపై త్రైమాసికానికి (ప్ర‌తి మూడు నెల‌ల‌కు ) రూ.500తో పాటు జీఎస్టీని ఇన్‌స్పెక్షన్ చార్జీగా విధించేవారు.

ఈ చార్జీల కారణంగా స్వయం సహాయక సంఘాలపై సుమారు ఒక శాతం వరకు అదనపు ఆర్థిక భారం పడుతూ, మహిళలకు తక్కువ వ్యయంతో రుణాలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ప్రతికూలంగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించి, మహిళల సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ చార్జీలను పూర్తిగా మినహాయించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యానికి మ‌హిళా సంఘాల త‌ర‌పున‌ మంత్రి కొండ‌ప‌ల్లి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో 2,50,255 స్వయం సహాయక సంఘాలకు రూ.20,359 కోట్లకు పైగా రుణాలు అందిస్తూ, SHG రుణాల పంపిణీలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ చార్జీల మిన‌హాయింపు వ‌ల్ల రు. 20 ల‌క్ష‌ల క్యాష్ క్రెడిట్ లోన్ తీసుకున్న ప్ర‌తి సంఘానికి మూడేళ్ల‌లో రు.93,500 వరకు ఆర్థిక లబ్ధి క‌లుగుతుంద‌ని… యూనియ‌న్ బ్యాంక్ నుంచి లోను తీసుకున్న 1.75 ల‌క్ష‌ల సంఘాల‌కు సంవత్స‌రానికి 586.25 కోట్ల ల‌బ్ధి క‌లుగుతుంద‌ని మంత్రి కొండ‌ప‌ల్లి తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం ఈ చార్జీల ర‌ద్దుపై నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డంతో స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌లు వేల కోట్ల‌ రూపాయ‌లు కోల్పోయార‌ని మంత్రి విమ‌ర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “ఒక్కో కుటుంబం – ఒక్కో పారిశ్రామికవేత్త” (One Family – One Entrepreneur) లక్ష్య సాధనకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుంద‌ని మంత్రి కొండ‌ప‌ల్లి పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *