-కృష్ణా డెల్టా రైతాంగానికి మేలు చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం
-13.08 లక్షల ఎకరాల ఆయుకట్టు ద్వారా 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం
-జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మిశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇందులో భాగంగా డెల్టా కాలువలపై ఆధారపడిన రైతులకు సకాలంలో సాగు నీరు అందించేందుకు సకాలంలో నీటిని విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.
కృష్ణా డెల్టా రైతాంగానికి సకాలంలో సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రకాశం బ్యారేజ్‌లోని కృష్ణా ఈస్ట్రన్ మెయిన్ హెడ్ రెగ్యులేటర్ నుంచి బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి తూర్పు, పశ్చిమ కాలువలకు 3,200 క్యూసెక్కుల సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన ‘ఏరువాక పౌర్ణమి’ కార్యక్రమానికి కొనసాగింపుగా కృష్ణా డెల్టా రైతులకు సాగునీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. కృష్ణా డెల్టా పరిధిలోని సుమారు 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు భూములకు దాదాపు 30 లక్షల మంది రైతులకు ఈ నీటి విడుదల ద్వారా సకాలంలో పంటలు వేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలాధార–జలహారతి’ కార్యక్రమంలో భాగంగా కాలువల మరమ్మతులు, పూడికతీత పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భూగర్భ జలాల రీఛార్జ్ కు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి నీటి కొరత లేకుండా సకాలంలో సాగునీరు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల గోపాలకృష్ణారావు మాట్లాడుతూ.. నీటి క్యాలెండర్ ప్రకారం జూలై 1న కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేయడం రైతులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. జూలై చివరి నాటికి వరి నాట్లు పూర్తి చేయడం ద్వారా నవంబర్‌లో వచ్చే తుఫానుల ప్రభావం నుంచి పంటలను రక్షించుకోవచ్చన్నారు. కృష్ణా డెల్టా కాలువల పూడికతీత, కట్టల బలపరిచేందుకు ఓ అండ్ ఎం నిధుల కింద రూ. 64 కోట్లు ఖర్చు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా రూ. 425 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రస్తుతం పులిచింతలలో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ, జూలై లో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలించి కృష్ణా డెల్టాకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ.. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద పెట్టుబడి సాయం జమ చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి, నీటి సంరక్షణ, కాలువల అభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు శాశ్వత ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘ఎల్‌నినో’ ప్రభావం వల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వినియోగించాలని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని నాయకులు, అధికారులు రైతులకు విజ్ఞప్తి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న నీటిని మొదట తాగు నీటి అవసరాలు, అనంతరం సాగు అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రానున్న ఖరీఫ్‌లో సమృద్ధిగా పంటలు పండాలని, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కృష్ణా జిల్లా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, జలవనరుల శాఖ ఎస్ఈ జే. గుణకరరావు, సీఈ బి. రాంబాబు, కేసీ డివిజన్ ఈఈ ఆర్. రవికిరణ్, కేఈ డివిజన్ ఈఈ ఆంజనేయ ప్రసాద్, ఇరిగేషన్ అధికారులు ఎల్. కృష్ణ ప్రసాద్, కే. బాబు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పి. శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News