-ఉద్యోగుల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
-జేఏసి జిల్లా చైర్మన్ డిఎస్ఎన్ రెడ్డి
-ఎంపీ కేశినేని శివనాథ్‌కు వినతి పత్రం అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీ జేఏసీ) జిల్లా నాయకులు గురువారం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని)ను కలిసి వినతిపత్రం అందజేశారు.
జిల్లా జేఏసీ చైర్మన్ డి. సత్యనారాయణ రెడ్డి నేతృత్వంలో ఎంపీని కలిసిన నాయకులు ఉద్యోగుల ప్రధాన సమస్యలను వివరించారు. పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని, హెల్త్ కార్డుల వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, సరెండర్ లీవ్, పీఆర్సీ, డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు. అలాగే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలు చేయడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను వేగవంతం చేయాలని, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పెన్షనర్లకు బకాయిల చెల్లింపు, అదనపు క్వాంటం పెన్షన్ పునరుద్ధరణ వంటి అంశాలను కూడా ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, పెండింగ్ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
జూలై 26లోగా ప్రభుత్వం ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర జేఏసీ కార్యవర్గ సమావేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు.
ఎం పి కి వినతి పత్రం అందజేసిన వారిలో జేఏసీ చైర్మన్ డి సత్యనారాయణ రెడ్డి తో పాటు సెక్రటరీ సయ్యద్ ఖాసిం, కో- చైర్మన్ , సిహెచ్ రామకృష్ణ, వైస్ చైర్మన్ -జి.నారాయణరావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జి.రామకృష్ణ, కోశాధికారి – బి.సతీష్ కుమార్, జాయింట్ సెక్రెటరీ సుందరయ్య, విష్ణువర్ధన్ రావు, క్షమా బేగం, విజయవాడ సిటీ జేఏసీ చైర్మన్ సిహెచ్.సివిఆర్ ప్రసాద్, సిటీ సెక్రటరీ – కాయమ్, నగర శాఖ కోచ్ చైర్మన్ నజురుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News