– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని (స్ట్రెస్) సమర్థవంతంగా నిర్వహించడం ప్రతి ఉద్యోగికి అత్యంత అవసరమని, మానసిక సమతుల్యత, సానుకూల దృక్పథం, సమయపాలనతో విధులు నిర్వహించినప్పుడే ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించగలమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ప్రత్యేక సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) సెషన్లలో భాగంగా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. సైకాలజిస్టులు డా. తేజావతి, డా. జి.శంకర్ రావు, డా. టీఎస్ రావు, బి.నవితశ్రీ బృందం రోజువారీ విధుల నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఒత్తిడికి కారణాలు, భౌతిక లక్షణాలు, ఉద్వేగ లక్షణాలు, ప్రవర్తనలో వచ్చే మార్పు, పని ఒత్తిడికి కారణాలు, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌పై సెషన్ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధికారులు తమ సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాల అమలు, ప్రజా సేవల మెరుగుదల, కార్యనిర్వహణలో సమన్వయం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలపై శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సిబ్బందిలో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత పనితీరు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, డిజిటల్ స్కిల్స్ తదితరాలను పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమంలో మొత్తం 50 స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు పాల్గొన్నారు.
సమన్వయకర్త జి.జ్యోతి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News