– సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించండి
– వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయండి
– ప్రకృతి వ్యవసాయం, అంతరపంటలపై ప్రత్యేక దృష్టిపెట్టండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సాగు విధానాలపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా అధిగమించేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణ, చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం జరిగింది. విత్తన గుళికల తయారీ, వర్షాలు రాకముందే పొడి భూమిలో విత్తనాలు విత్తుట, అంతర పంటల సాగు, నేల ఆచ్ఛాదనతో నేలలోని తేమ సంరక్షణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ అధికారులు రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయంలో అంతర్ పంటలు వేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. పొలంలో అంతర పంటలతో పాటు ఇతర పంటలు వేస్తే శత్రు పురుగుల నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంపై గ్రామస్థాయిలో ఈ శుక్ర, శని, ఆదివారాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అవగాహన కల్పించాలన్నారు. విత్తన శుద్ధి, జీవామృతం, ఘనామృతం వాడటం వల్ల భూసారం పెరిగి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ జి.శ్రీనివాస్‌రావు, సహకార అధికారి నల్లి అజిత్ కుమారి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ కె.నాగమల్లిక, సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, నీటి వినియోగదారుల సంఘాల ఛైర్మన్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మన్లు, ప్రకృతి వ్యవసాయ విధానాలను విజయవంతంగా అమలు చేస్తున్న రైతులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News