-తీవ్ర రక్తస్రావం, మూర్ఛ సమస్యలు తగ్గించడం ద్వారా మాతృత్వ మరణాలకు చెక్
-అవలంబించాల్సిన విధానాలపై తొలివిడత కింద బాపట్ల, అనంతపురం జిల్లాల్లోని వైద్యులు, స్టాఫ్ నర్సులకు అవగాహన
-రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధరబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భిణుల ప్రసవ సమయంలో అధిక రక్తస్రవం, అధిక రక్తపోటు (బీపీ) వల్ల మూర్ఛ వంటి సమస్యలు తలెత్తకుండా ఆధునాతన విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గైనకాలజిస్టులు, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్)లకు శిక్షణ ఇప్పిoచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో స్వస్తి (ఎన్జీఓ), ఫెడరేషన్ ఆఫ్ అబెస్ట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా(ఫాగ్సీ) ల నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకోవడం ప్రారంభించింది. రాష్ట్రంలో తొలివిడత కింద అనంతపురం, బాపట్ల జిల్లాల్లో పనిచేసే గైనకాలజిస్టులు, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సుల(సుమారు 75 మంది)కు మంగళగిరిలో రెండురోజుల శిక్షణ గురువారంతో ముగిసిందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇంఛార్జి కమిషనర్ చక్రధర్ బాబు వెల్లడించారు. దశలవారీగా మిగిలిన జిల్లాలోని వారికి కూడా శిక్షణ ఇస్తామని చెప్పారు.
2 కారణాలతోనే 43% మరణాలు
రాష్ట్రంలో నమోదవుతోన్న మాతృ మరణాల్లో ఎక్కువగా అధిక రక్తస్రవం, అధిక రక్తపోటువల్ల వచ్చే మూర్చ (ఎక్లాంప్సియా) వంటి కారణాలవల్ల జరుగుతున్నాయి. వంద మంది మరణిస్తే ఈ కారణాలతో మరణించే వారు అత్యధికంగా 43% (అధిక రక్తస్రవం-20%, ఎక్లాంప్సియా-23%) మంది ఉంటున్నారు. ఈ తరహా మరణాలు తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్వస్తి (ఎన్జీఓ సంస్థ), ఎఫ్ ఓ జి ఎస్ ఐ – ఫాగ్సీల సహకారంతో అధిక రక్తస్రవం సమస్యను త్వరగా గుర్తించడం, గర్భాశయాన్ని మసాజ్ చేయడం, ఆక్సిటోసిన్, ట్రానెక్సామిక్ మందులు, ఐవీ ద్రవాలు ఇవ్వడం, నిశిత పరిశీలన ద్వా రా అవసరమైన చికిత్స (ఈ-మోటివ్ బండిల్) అందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళగిరిలో 2రోజులపాటు జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఎఫ్ ఓ జి ఎస్ ఐ -ఫాగ్సీ జాతీయ అధ్యక్షురాలుగా ఎన్నికైన డాక్టర్ మాధురి, ఏపీ చాప్టర్ ముఖ్య ప్రతినిధి డాక్టర్ సుశీల వివరించారు. ప్రస్తుత విధానంలో అధిక రక్తస్రావం సమస్యను గుర్తించడంలో, సమయానికి తగినట్లు పెద్దాసుపత్రులకు తరలించడంలో, తరలించేముందు గర్భిణులకు అందించాల్సిన చికిత్స విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని డాక్టర్ మాధురి, డాక్టర్ సుశీల పేర్కొన్నారు. ప్రసవ సమయంలో రక్తస్రావాన్ని కొలిచే డ్రేప్ లేదా షీటు ఉపయోగించ డం ద్వారా అధిక రక్తస్రవ సమస్య వెంటనే ఖచ్చితంగా గుర్తించేందుకు వీలుందని తెలిపారు. ప్రస్తుత విధానంలో ఈ షీటు ఉపయోగిస్తున్న దాఖలాలు తక్కువగా ఉందని తెలిపారు. ఈ షీట్లను ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఎక్లాంప్సియా సమస్యల నిరోధ చర్యల్లో భాగం గర్భిణుల ఆరోగ్య పరిస్థితిపై ‘గెస్టోసిస్ స్కోరు”ను పరిగణనలోనికి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ స్కోర్ ద్వారా గర్భిణులకు వచ్చే ప్రీ-ఎక్లాంప్సియా ప్రమాద తీవ్రతపై అంచనా వేయడానికి దోహదపడుతుంది. ఈ విధానంలో గర్భిణీ వయసు, ఎన్నో కాన్పు, రక్తపోటు, మధుమేహం ఉందా? లేదా?. కుటుంబంలో ఎవరికైనా ఎక్లాంప్సియా సమస్య, ఇతర సమస్యల గురించి ‘స్కోర్’ రూపంలో పరిగణనలోనికి తీసుకుంటారు. 3 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ వస్తే లోడోస్ ఆస్ప్రిన్ మాత్రను ఉపయోగించాలని వైద్యులు సూచించారు. ఇలాoటి మెథడ్స్ పాటిస్తే.. మాతృత్వ మరణాలను బాగా తగ్గించవచ్చునని చెప్పారు.
Prajavartha Online Telugu News