Breaking News

మాతృమూర్తుల ఆరోగ్యానికి భరోసాగా ఉండాలి

-సిజేరియన్లు తగ్గించాలి
-మరణాలపై ఆడిట్ జరగాలి
-గర్భిణుల వివరాలు తప్పనిసరిగా నమోదు జరగాలి
-పాలియేటివ్ కేర్ లో ముందున్న కేరళ ప్రభుత్వ చర్యలపై అధ్యయనం చేయాలి!
-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భందాల్చిన ప్రతి ఒక్క మహిళ వివరాలు తప్పనిసరిగా పోర్టల్ లో నమోదు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ స్పష్టంచేశారు. దీనివల్ల తల్లితోపాటు బిడ్డకు ఆరోగ్య భద్రత లభిస్తోందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40వేల పైచిలుకు ఆశాలు ఉన్నందున నూటికి నూరు శాతం గర్భిణు ల వివరాల నమోదు జరిగేలా అన్ని స్థాయుల్లోనూ కృషి జరగాలని తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో కమిషనర్ చక్రధరబాబుతో కలిసి కార్యదర్శి సురేష్ కుమార్ సీజినల్ వ్యాధులు, పల్స్ పోలియో, హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ, జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అమలవుతోన్న పథకాల సమన్వయ అధికారులతో గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో 85.43%, ఏలూరు జిల్లాలో 87.0, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 87.36% చొప్పున ప్రెగ్నేట్ వుమెన్ పేర్ల నమోదు జరగడంపై అధికారులను వివరణ కోరారు. కర్నూలు జిల్లాలో 98.16%, పశ్చిమగోదావరి జిల్లాలో 97.99%, అల్లూరిసీతారామరాజు జిల్లాలో 96.90% ప్రెగ్నేట్ వుమెన్ వివరాలు నమోదుచేశారన్నారు. ఇక్కడ అవలంబించిన విధానాలను, తక్కువగా నమోదు జరిగిన జిల్లాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులతో పరిశీలన చేసి, సదరు జిల్లాలకు తగిన ఆదేశాలు పంపాలని సమన్వయ అధికారులకు స్పష్టంచేశారు. అలాగే సిజేరియన్ కేసులు తగ్గించేందుకు కూడా కృషి జరగాలన్నారు. ముఖ్యంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 80.76%, శ్రీకాకుళం జిల్లాలో 75%, పశ్చిమగోదావరి జిల్లాలో 72.50% వరకు సిజేరియన్ కేసులు నమోదుకావడానికి కారణాలు ఏమిటని అధికారులను ప్రశ్నించారు. సిజేరియన్లు ఏయే పరిస్థితుల్లో చేయాలో గర్భిణుల కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సహేతుకమైన కారణాలు లేకుండా సిజేరియన్లు జరుగుతుంటే… సదరు బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడకూడదని స్పష్టంచేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 62%, ప్రభుత్వాసుపత్రుల్లో 42% చొప్పున సిజేరియన్లు జరుగుతున్నాయని అధికారులు ముఖ్య కార్యదర్శికి వివరించారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో జరిగిన 253 మాతృత్వ మరణాలపై ఆడిటింగ్ తప్పకుండా జరగాలని ముఖ్య కార్యదర్శి స్పష్టంచేశారు. ఆడిట్ ద్వారా గుర్తించిన అంశాలపై వైద్యులు, ఇతర సిబ్బందికి అవగాహన కలిపించి మాతృత్వ మరణాల తగ్గుదలకు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వాసుపత్రులో ఉన్న పాలియేటివ్ వార్డుల్లో ఉండే వారికి సపర్యలు చేసేందుకు ఉన్న సిబ్బంది వివరాలను సురేష్ కుమార్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎన్జీఓల సహకారం తీసుకోవాలి!

కేరళ ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలపై అధ్యయనం చేయాలని, ఎన్జీఓల సహకారాన్ని తీసుకోవాలని పేర్కొన్నారు. వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రుల కలిపి 24 పాలియేటివ్ వార్డులు ఉన్నాయని అధికారులు వివరించారు. అలాగే సంచార చికిత్స ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 1,10,346 మంది వృద్ధులకు ఇళ్లల్లోనే సేవలు అందుతున్నాయని తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారుల సమన్వయంతో కలసి పనిచేయాలని అధికారులకు ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ స్పష్టంచేశారు. హాట్ స్పాట్స్ గా గుర్తించిన గ్రామాల్లో ప్రత్యేక చర్యలు అవసరమని పేర్కొన్నారు. ఐదేళ్లలోపు ఉన్న చిన్నారుల్లో ఇప్పటివరకు 98.70% మంది పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు అధికారులు వెల్లడించారు. 15 ఏళ్లలోపు బాలికల్లో హెచ్పీవీ వ్యాక్సిన్ ను 83.67% మందికి వేసినట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముందు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధరబాబు విడిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వర్చువల్ గా సమావేశాన్ని నిర్వహించారు. మందుల కొరత రాకుండా చూడాలని, అవసరమైచోట్ల స్థానికంగా కొనుగోలు చేసుకోవాలని స్పష్టంచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *