గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను క్షేత్రస్థాయిలో మరింత వేగవంతం చేయాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో), నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని చౌత్రా సెంటర్ ప్రాంతంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను, కిద్వా నగర్, లాలాపేట సచివాలయాల్లో జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ని తనిఖీ చేసి, బిఎల్ఓలు, సూపర్వైజరీ అధికారులకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పురోగతి అత్యల్పంగా ఉన్న బూత్‌లను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి బూత్‌లో అర్హులైన ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందించేందుకు బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి తప్పనిసరిగా కలవాలని, వారి సందేహాలను నివృత్తి చేస్తూ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఏఈఆర్వోలు, సూపర్వైజర్లు రోజువారీ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) బీఎల్‌వోలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రతి ఓటర్ ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా, 2002 సంవత్సరంలో ఓటరు నమోదుకు సంబంధించిన వివరాలు ఉంటే వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని, లేకపోతే తల్లిదండ్రులు లేదా అవ్వ, తాత, నాన్నమ్మల్లో ఎవరిదైనా ఓటు ఏ రాష్ట్రం, నియోజకవర్గం, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్‌లో నమోదై ఉందో ఆ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
కార్యక్రమంలో ఏఈఆర్వోలు తేజ పవన్ నాయక్, సుధారాణి, సూపర్వైజరీ అధికారులు ఫయాజ్, కోటయ్య, యూసఫ్ బేగ్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News