విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు అధ్యక్షతన 89వ శాప్ బోర్డ్ సమావేశం ఈరోజు శాప్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాల కల్పన, క్రీడా మౌలిక వసతుల బలోపేతం, రానున్న క్రీడా కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై బోర్డు సభ్యులు సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక “అమరావతి ఛాంపియన్షిప్ కప్” నిర్వహణ, పోటీల రూపకల్పన, క్రీడాకారుల భాగస్వామ్యం, రాష్ట్రవ్యాప్తంగా క్రీడలకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అలాగే శాప్ ఆధ్వర్యంలో చేపట్టనున్న భవిష్యత్ కార్యక్రమాలు, శిక్షణా కేంద్రాల అభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమం, ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించే చర్యలపై కూడా చర్చించారు. రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు శాప్ నిరంతరం కృషి చేస్తోందని, రాష్ట్రాన్ని దేశంలోనే క్రీడారంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని శాప్ చైర్మన్ రవి నాయుడు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో శాప్ మేనేజింగ్ డైరెక్టర్ భరణి, IFS, ఏవో రామవత్ వెంకట రమణ నాయక్, బోర్డు సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News