– నియోజకవర్గాల్లో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విస్తృత పర్యటనలు
– కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులకు దిశానిర్దేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)ను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రతిరోజూ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
శుక్రవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో సర్ ప్రక్రియను పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితాలో కచ్చితత్వం ఎన్నికల ప్రక్రియకు అత్యంత కీలకమని, అర్హులైన ఏ ఒక్క ఓటరూ జాబితా బయట లేకుండా.. అనర్హులెవరూ జాబితాలో లేకుండా స్వచ్ఛమైన, సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) జరుగుతోందని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు. జిల్లాలో 16,73,496 (97.67 శాతం) ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని, అదేవిధంగా 6,34,592 (37.04 శాతం) ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందన్నారు. ఈ నేపథ్యంలో వేగంగా, కచ్చితత్వంతో డిజిటైజేషన్ ప్రక్రియను ముందుకు నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తిరువూరులో 2,03,465 (97.49 శాతం), విజయవాడ పశ్చిమ 2,51,459 (97.85 శాతం), విజయవాడ సెంట్రల్ 2,70,678 (97.43 శాతం), విజయవాడ తూర్పు 2,63,926 (97.85 శాతం), మైలవరం 2,76,608 (97 శాతం), నందిగామ 2,01,677 (97.2 శాతం), జగ్గయ్యపేట 2,05,683 (99.1 శాతం) మేర ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వివరించారు. బీఎల్‌వోలు, అధికారులు ఈసీఐ నియమనిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాలని, ఎలాంటి ప్రభావాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా నిబద్ధతతో సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
Prajavartha Online Telugu News