-పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
-అధికార అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు.. : వెలంపల్లి
-ప్రశ్నిస్తే కేసులు పెడతారా?.. రాష్ట్రంలో నడుస్తోంది ‘రెడ్ బుక్ రాజ్యాంగం : వెలంపల్లి
-కూటమికి రోశయ్య ప్రసంగాలే కరెక్ట్ మెడిసిన్.. బాబు టీమ్‌కు ట్రైనింగ్ ఇవ్వాలి : వెలంపల్లి
-చంద్రబాబుకు ఆర్థిక క్రమశిక్షణ లేదు.. నాడే కౌన్సిల్‌లో చెప్పిన రోశయ్య : వెలంపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనమైన స్వర్గీయ కొణిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలోని త్రిమూర్తి చౌక్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రోశయ్య విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణి చేసారు. రోశయ్య జయంతి, వర్ధంతుల సందర్భంగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమకు ఆనవాయితీగా వస్తోందని వెలంపల్లి శ్రీనివాసరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆర్యవైశ్యులకు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రోశయ్య ఒక గొప్ప నిదర్శనమని కొనియాడారు. పొట్టి శ్రీరాములు ని, మహాత్మా గాంధీ ని తాము చూడకపోయినా, తమ మధ్యే ఉంటూ ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన రోశయ్య ని చూసే భాగ్యం కలిగిందన్నారు. పదవుల వెనుక ఆయన ఎన్నడూ పడలేదని, పదవులే ఆయన వెతుక్కుంటూ వచ్చాయని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు కేవలం రోశయ్య కి మాత్రమే దక్కిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, వివిధ శాఖల మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా ఇన్ని ఉన్నత పదవులు నిర్వహించినప్పటికీ, తన రాజకీయ జీవితంలో ఎక్కడా చిన్న మచ్చ కూడా లేకుండా నీతి, నిజాయితీలతో రాజకీయం చేసిన మహోన్నత వ్యక్తి రోశయ్య గారని కొనియాడారు.
ఐదు దశాబ్దాల పాటు సాగిన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను, అటు అధికారాన్ని, ఇటు ప్రతిపక్షాన్ని చూసిన రోశయ్య ని చూసి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంతో నేర్చుకోవాలని వెలంపల్లి శ్రీనివాసరావు హితవు పలికారు. సభలో రోశయ్య అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల ప్రశ్నలకు ఎంతో చలోక్తులతో, సమర్థవంతంగా సమాధానాలు చెప్పేవారని, అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని అంతే ధీటుగా నిలదీసేవారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి దిగువ స్థాయి నాయకుల వరకు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మంత్రి వంగలపూడి అనిత గాని రోశయ్య గారిని చూసి వారి భాషను, మాట్లాడే విధానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కూటమి నాయకులు మాట్లాడుతున్న తీరు, ప్రవర్తిస్తున్న విధానం వల్ల రాష్ట్ర ప్రజల ముందు వారు ఏ విధంగా అభాసుపాలవుతున్నారో అందరూ గమనిస్తున్నారని అన్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన అంతా ఒక డొల్ల పరిపాలన అని వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. నేడు రాష్ట్రంలో ప్రశ్నించడానికే అవకాశం లేకుండా పోయిందని, ప్రశ్నించే గొంతులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని అడిగినా, ప్రభుత్వ తప్పులను ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా కేసులు పెట్టే విధంగా నాయకులు వ్యవహరించడం అత్యంత బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన కూటమి నాయకులందరికీ రోశయ్య గారి అసెంబ్లీ ప్రసంగాలను, ఆయన మాట్లాడిన మాటల వీడియోలను చూపించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని కోరారు. అప్పుడైనా వారి నోర్లు బాగుపడతాయని, అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదని మండిపడ్డారు.
రోశయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో ఏ ఒక్క రోజు కూడా ఓవర్ డ్రాఫ్ట్ (OD) లేకుండా అద్భుతంగా పరిపాలన సాగించారని, కానీ నేడు కూటమి ప్రభుత్వంలో ప్రతిరోజూ ఓవర్ డ్రాఫ్టే నడుస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో కౌన్సిల్‌లోనే రోశయ్య చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ… ఆయనకు ఆర్థిక విషయాలపై ఎలాంటి అవగాహన, క్రమశిక్షణ ఉండదని స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంలో సాగుతున్న దౌర్జన్యాలు, రౌడీయిజాలు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు మరొక్కసారి గమనించాలని కోరారు. రోశయ్య గారు చూపిన ఆర్థిక క్రమశిక్షణ, ఆయన ఆశయ సాధనల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోశయ్య గారి ఆశయాలను, ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తామంతా ఎల్లప్పుడూ కృషి చేస్తామని వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావుతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News