Breaking News

పశ్చిమలో ఘనంగా వంగవీటి మోహన రంగ 79వ జయంతి కార్యక్రమం

-పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
-బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగ – మాజీ మంత్రి వెలంపల్లి
-రంగా పేరు చెప్పడానికే కూటమి నేతలకు వణుకు – మాజీ మంత్రి వెలంపల్లి
-అసలు రంగా కి పవన్ ఎప్పుడైనా నివాళులర్పించారా? – మాజీ మంత్రి వెలంపల్లి
-రంగా ఆశయ సాధనలో వైఎస్సార్సీపీ ఎప్పుడూ ముందుంటుంది – వెలంపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్గీయ వంగవీటి మోహన రంగ 79వ జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చెరువు సెంటర్ వంగవీటి మోహన రంగ విగ్రహం వద్ద పశ్చిమ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాపు టీమ్ మరియు రంగా అభిమానుల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణి చేసారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల ద్వంద్వ నీతిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి, వారి హక్కుల కోసం పోరాడిన నిజమైన ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన రంగ అని వెలంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. రంగా ప్రజా ఉద్యమాల్లో నిరంతరం శ్రమిస్తూ, చివరికి ప్రజా సంక్షేమం కోసమే తన ప్రాణాలను సైతం అర్పించారని గుర్తుచేశారు. ఇంతటి మహోన్నతమైన త్యాగం చేసిన వ్యక్తిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే ప్రతి సంవత్సరం రాజకీయాలకతీతంగా రంగా అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు కలిసి ఇక్కడ ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

చిన్న వయసులోనే అప్పటి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రోడ్డుపై కూర్చుని దీక్ష చేస్తున్న వంగవీటి రంగా ని, నాటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అత్యంత నిర్మొహమాటంగా, క్రూరంగా హతమార్చడం జరిగిందని వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ చారిత్రక ఘోరాన్ని ఈరోజుకూ ప్రజలెవరూ మర్చిపోలేరని ఆయన స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుండే వి.ఎం. రంగా ఆలోచనా విధానాన్ని, ఆశయాలను మనమందరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు.

స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కి వంగవీటి రంగా తో ఎంతో అనుబంధం ఉండేదని, అదేవిధంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కూడా రంగా అంటే అపారమైన గౌరవం, అభిమానం ఉన్నాయని వెల్లంపల్లి పేర్కొన్నారు. రంగా గారి ఆశయాల సాధన కోసం గతంలో రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ఎంతో కృషి చేశారని, వారి ఆశయాలను నిరంతరం కొనసాగించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి నాయకులు కనీసం వంగవీటి రంగా పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారని, వారిని స్మరించుకునే పరిస్థితి అస్సలు లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గానీ ఏ రోజైనా రంగా కి మనస్ఫూర్తిగా నివాళులర్పించారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రంగా  విషయంలో ఎప్పుడూ ఒకే మాటపై ఉండరని, ఒకసారి రంగా కి కాఫీ ఇచ్చానని చెప్తూ, మరోసారి అసలు రంగా ని చూడలేదంటారని ఎద్దేవా చేశారు. ఒకసారి రంగా తో ఎక్కువ పరిచయం ఉందంటూనే, ఇంకోసారి పరిచయం లేదని అంటున్న పవన్ కళ్యాణ్.. కేవలం కాంట్రవర్సీ డైలాగుల కోసమే రంగా ని, వారి కుటుంబ సభ్యులను వాడుకుంటున్నారని, వారి సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లోని అన్ని కులాల వారు, అన్ని మతాల వారు రంగా ని గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తారని, రంగా జయంతి, వర్ధంతి వేడుకలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతాయని వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఈ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులను ఆయన అభినందించారు. అనుక్షణం రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్న అభిమానులందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని, రంగా ఆశయ సాధన కోసం తమ పార్టీ నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు రంగ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *