-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమంలో షిఫ్టింగ్, డెత్, అబ్సెంట్ ఓట్లపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బిఎల్వోలు సేకరించిన ప్రతి షిఫ్టింగ్, డెత్, అబ్సెంట్ ఓటును సంబంధిత ఏఈఆర్వోలు స్వయంగా బిఎల్వోలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్న అనంతరం మాత్రమే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం పశ్చిమ నియోజకవర్గంలోని కుద్దూస్ నగర్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రామకృష్ణాపురం ప్రాంతాల్లో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, బిఎల్వోలు సమర్పించే ప్రతి ఎలిమినేషన్ ఫారాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని, ఓటరు నిజంగా మరణించారా, వేరే ప్రాంతానికి శాశ్వతంగా మారారా, లేదా ఆ చిరునామాలో నివసించడం లేదా అనే విషయాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించిన తర్వాత మాత్రమే సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఏఈఆర్వోకు అదనంగా ముగ్గురు అడిషనల్ ఏఈఆర్వోలు, ఒక జిల్లా స్థాయి అధికారిని నియమించినట్లు తెలిపారు. ఈ బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ అంశాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ తక్కువగా ఉన్న బిఎల్వోలతో ఏఈఆర్వోలు ప్రత్యేకంగా సమావేశమై అందుకు గల కారణాలను తెలుసుకోవాలని, సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి బిఎల్వో పనితీరును నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని, ఎక్కడైనా జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్వో ఏ. రవీంద్రరావు, ఏఈఆర్వోలు ఎన్. శ్రీనివాస్, కె. లక్ష్మి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News