విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలంలో బుడమేరు కాలువలో నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ నిరంతరం వ్యర్థాలు, పూడిక తొలగింపు పనులు చేపడుతోంది. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు సూచనలతో బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం రామకృష్ణాపురం వద్ద బుడమేరు కాలువలో పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను యంత్రాల సహాయంతో తొలగించారు.
ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ మాట్లాడుతూ, వర్షపు నీరు వేగంగా ప్రవహించేలా బుడమేరు కాలువను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నామని తెలిపారు. కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజలు సహకరించాలని, వ్యర్థాలను నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే వేయాలని సూచించారు. వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా నగరంలోని బుడమేరు పరిధిలోని అన్ని కీలక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణతో పూడిక, వ్యర్థాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
Prajavartha Online Telugu News