Breaking News

అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలి… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

-ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై అవగాహన
-సహాయం కోసం మీ బిఎల్ఓ లను సంప్రదించాలి
-పెనమలూరులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తిగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి ఏజెంట్లు, ప్రజలు సమష్టిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు.

మంగళవారం ఉదయం పెనమలూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో పెనమలూరు నియోజకవర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సమగ్రంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి పక్షపాతం లేకుండా పూర్తిగా పారదర్శకంగా సర్ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈ ప్రక్రియపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, సందేహాలు ఉంటే ఈఆర్వో, ఏఈఆర్వో లేదా తనను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు.

సాధారణంగా జిల్లా స్థాయిలోనే సమావేశాలు నిర్వహించినప్పటికీ, ఈసారి నియోజకవర్గ స్థాయిలోనే రాజకీయ పార్టీలతో నేరుగా సమావేశమవుతున్నామని తెలిపారు. దీనివల్ల రాజకీయ పార్టీల్లో విశ్వాసం పెరగడంతో పాటు, వారి సందేహాలను నివృత్తి చేసి ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందన్నారు. పెనమలూరుతో ప్రారంభించి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలోని ప్రతి ఓటరుకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నారని, తిరిగి వచ్చిన ఫారాల ఆధారంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా రూపొందుతుందని చెప్పారు. ఫారం తిరిగి అందని వారి పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో ఉండవని స్పష్టం చేశారు. అందువల్ల ప్రతి అర్హుడైన ఓటరు తప్పనిసరిగా ఫారం నింపి తిరిగి ఇవ్వాలని కోరారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ సజావుగా జరుగుతున్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసించడం, తరచూ నివాసం మారడం, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రవేశానికి పరిమితులు ఉండడం, ఉద్యోగాల నిమిత్తం ఇంట్లో ఎవరూ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో బీఎల్ఓలకు ఫారాల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఇటువంటి పరిస్థితులను అధిగమించేందుకు పొరుగువారి ద్వారా సమాచారం సేకరించడం, అపార్ట్‌మెంట్ సంఘాలతో సమన్వయం చేసుకోవడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లు (బిఎల్ఏ)చురుకుగా వ్యవహరించి ఓటర్లకు అవగాహన కల్పించాలని, ఫారాలు సకాలంలో బీఎల్ఓలకు అందేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఎన్నికల సంఘం ఒక్కదాని బాధ్యత మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు.

తాత్కాలికంగా ఇతర ప్రాంతాలు లేదా విదేశాల్లో ఉన్న ఓటర్లు కూడా ఆన్‌లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించే అవకాశం ఉందని తెలిపారు. ఈసీఐ నెట్ యాప్‌లో “బుక్ ఎ కాల్ విత్ బీఎల్ఓ” సదుపాయాన్ని ఉపయోగిస్తే సంబంధిత బీఎల్ఓ స్వయంగా ఫోన్ చేసి సహాయం చేస్తారని చెప్పారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ల ద్వారా కూడా అవసరమైన సహాయం పొందవచ్చన్నారు.

అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ కేటగిరీలకు సంబంధించిన జాబితాలను ఇప్పటికే బూత్ స్థాయి ఏజెంట్లకు అందజేశామని తెలిపారు. రాజకీయ పార్టీలు ఆ జాబితాలను పరిశీలించి, సంబంధిత ఓటర్లను సంప్రదించి అవసరమైన ఫారాలు సమర్పించేలా సహకరించాలని కోరారు.

డేటా మ్యాపింగ్‌కు సంబంధించి కొన్ని కేసుల్లో సాంకేతిక కారణాల వల్ల మ్యాపింగ్ జరగకపోయినా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నోటీసులు జారీ చేసి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. 1987కు ముందు, 1987 నుంచి 2004 మధ్య, 2004 తర్వాత జన్మించిన వారి విషయంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. కుల ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్, భూ రికార్డులు తదితర ఎన్నికల సంఘం ఆమోదించిన పత్రాలను సమర్పించడం ద్వారా అర్హులైన ఓటర్ల పేర్లు తుది ఓటర్ల జాబితాలో కొనసాగుతాయని తెలిపారు.

ఓటర్లకు సహాయార్థం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు:

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారం నింపడం, సమర్పించడం లేదా ఇతర సందేహాల నివృత్తి కోసం నియోజకవర్గ స్థాయిలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన మండలాల వారీగా హెల్ప్‌డెస్క్ ఫోన్ నంబర్లు ఈ విధంగా ఉన్నాయి.

పెనమలూరు తహసీల్దార్ కార్యాలయం – 9398025224

కంకిపాడు తహసీల్దార్ కార్యాలయం – 7013539973

ఉయ్యూరు తహసీల్దార్ కార్యాలయం – 9705536206

తాడిగడప మున్సిపాలిటీ – 9000168972

ఉయ్యూరు మున్సిపాలిటీ – 9966142299

ఎన్యూమరేషన్ ఫారానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఫారం అందకపోయినా లేదా ఇతర సహాయం అవసరమైనా ప్రజలు సంబంధిత హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

సమావేశంలో ఉయ్యూరు ఆర్డిఓ ఎస్ కరుణ కుమారి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *