Breaking News

హస్తకళాకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం… : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

-లేపాక్షి హస్తకళా మహోత్సవం – హస్తకళ ఎక్స్‌పో 2026 ఘన ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “లేపాక్షి హస్తకళా మహోత్సవం – హస్తకళ ఎక్స్‌పో 2026” కార్యక్రమాన్ని విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి సవితమ్మ, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన హస్తకళాకారులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన అన్ని హస్తకళా స్టాళ్లను సందర్శించి కళాకారులతో ఆత్మీయంగా మాట్లాడారు. కొండపల్లి బొమ్మలు, కలంకారి, ఎటికొప్పాక బొమ్మలు, ఉప్పాడ చేనేత, మంగళగిరి వస్త్రాలు, వెదురు, చెక్క, లోహం, రాతి, తాటి తదితర హస్తకళా ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. ప్రతి కళాఖండం వెనుక ఉన్న కళాకారుల శ్రమ, నైపుణ్యం, సృజనాత్మకతను అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ హస్తకళలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయిలో ఉన్నాయని కొనియాడారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, హస్తకళలు కేవలం వస్తువులు కాదని, మన సంస్కృతి, సంప్రదాయం, చరిత్రను భావితరాలకు అందించే అమూల్యమైన వారసత్వమని అన్నారు. కళాకారుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రతి హస్తకళాకారుని వద్దకు వెళ్లి వారి జీవన పరిస్థితులు, వృత్తిపరమైన సమస్యలు, ఆదాయ పరిస్థితులు, ముఖ్యంగా వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య సేవలు, బీమా, సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన కళాకారునికి చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

కళాకారులు తయారు చేసే ప్రతి ఉత్పత్తికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. లేపాక్షి బ్రాండ్‌ను ప్రపంచ స్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, యువత సంప్రదాయ హస్తకళల వైపు ఆకర్షితులయ్యేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. హస్తకళలను ఆదరించడం అంటే మన సంస్కృతిని, మన కళాకారులను, వారి కుటుంబాలను ఆదరించినట్లేనని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలు స్వదేశీ హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కళాకారుడు ఆర్థికంగా బలపడితేనే కళ సజీవంగా ఉంటుందని, హస్తకళా రంగ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

బీసీ సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, హస్తకళలు, చేనేత రంగాలు రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల కళాకారులు, మహిళా హస్తకళాకారులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. హస్తకళాకారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, ఆధునిక డిజైన్‌లపై అవగాహన, మార్కెటింగ్ అవకాశాలు, ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. “లేపాక్షి హస్తకళా మహోత్సవం – హస్తకళ ఎక్స్‌పో 2026” కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప వేదికగా నిలుస్తోందని, రాష్ట్ర ప్రజలు హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్  మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర హస్తకళా రంగం నూతన దిశగా పయనిస్తోందని తెలిపారు. హస్తకళాకారుల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ అవకాశాల విస్తరణ, లేపాక్షి బ్రాండ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఇటీవల ప్రకటించిన 30 జాతీయ హస్తకళా అవార్డుల్లో 10 అవార్డులు ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులకు దక్కడం రాష్ట్రానికి గర్వకారణమని డా. హరిప్రసాద్ అన్నారు. ఈ ఘనత కళాకారుల ప్రతిభకు, అంకితభావానికి నిదర్శనమని పేర్కొంటూ, రానున్న రోజుల్లో మరింత మంది కళాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా సంస్థ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని తెలిపారు.

“లేపాక్షి హస్తకళా మహోత్సవం – హస్తకళ ఎక్స్‌పో 2026” రాష్ట్రంలోని వేలాది మంది హస్తకళాకారులకు తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే అపూర్వ వేదికగా నిలుస్తోందన్నారు. ఈ మహోత్సవం ద్వారా కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ లభిస్తుందని, వారి ఆదాయం పెరుగుతుందని, సంప్రదాయ కళల పట్ల యువతలో ఆసక్తి పెంపొందుతుందని తెలిపారు.

రాష్ట్ర ప్రజలు కుటుంబ సమేతంగా ఈ మహోత్సవానికి విచ్చేసి హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని డా. హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. హస్తకళలను ఆదరించడం అంటే మన సంస్కృతిని, సంప్రదాయాన్ని, వేలాది మంది కళాకారుల కుటుంబాల జీవనోపాధిని పరిరక్షించినట్లేనని పేర్కొన్నారు. హస్తకళా రంగాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన రంగంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ మహోత్సవం ఆ దిశగా ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, హస్తకళా సంస్థల ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన హస్తకళాకారులు, కళాభిమానులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *