గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాన్ని పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాబోయే జూలై 31వ తేదీ లోపు నగరంలో అవెన్యూ ప్లాంటేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్, పార్క్ విభాగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఏడిహెచ్ శాంతి, ఏఈ నాసరయ్యలతో ప్లాంటేషన్ పై సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాంటేషన్ ని మొక్కుబడి కార్యక్రమంలా కాకుండా, నగర ప్రజల భాగస్వామ్యంతో ఒక హరిత ఉద్యమంలా సాగాలని ఆకాంక్షించారు. ఇందుకోసం స్థానిక నివాసితులు, స్వచ్ఛంద సంస్థలు మరియు మొక్కల ప్రేమికులను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. నగరంలో ప్లాంటేషన్ డ్రైవ్‌ను అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, ఎక్కడ పడితే అక్కడ కాకుండా ముందస్తు వ్యూహంతో ‘పిన్ పాయింట్’ పద్ధతిలో మాత్రమే మొక్కలను నాటాలని స్పష్టం చేశారు. మొక్కల కోసం గోతులను ఇష్టానుసారం తవ్వకుండా డిగ్గింగ్ యంత్రాన్ని వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా నగరంలోని విద్యాసంస్థలు, ప్రధాన వ్యాపార సముదాయాలు, హాస్పిటల్స్ పరిసరాలతో పాటు అన్ని ముఖ్యమైన ప్రధాన రహదారులను కవర్ చేస్తూ ఈ ప్లాంటేషన్ విస్తృతంగా జరగాలన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటి మనుగడ కూడా అంతే ముఖ్యమని గుర్తు చేస్తూ, నాటిన ప్రతి మొక్క రక్షణకు తప్పనిసరిగా ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పశువులు లేదా ఇతర కారణాల వల్ల మొక్కలు పాడవకుండా తగిన సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. నగరాన్ని హరిత నగరంగా మార్చడంలో జూలై 31 గడువు అత్యంత కీలకమని, ఇంజినీరింగ్ మరియు పార్క్ విభాగాలు నిరంతరం సమన్వయంతో కృషి చేయాలన్నారు.
Prajavartha Online Telugu News