-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
షిఫ్ట్ ఓటర్ల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా తూర్పు నియోజకవర్గంలోని జేడీ నగర్, తోటవారి వీధిలో ఉన్న 59వ సచివాలయాన్ని సందర్శించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)–2026 ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయా చిరునామాల్లో నివసించని వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. గతంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు జక్కంపూడిలో గృహాలు కేటాయించి అక్కడికి తరలించినట్లయితే, జక్కంపూడిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ నివసిస్తున్న విజయవాడ వాసులందరూ ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే జక్కంపూడిలో SIR పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
అనంతరం 59వ సచివాలయంలో ఎస్ఐఆర్ పురోగతిని సమీక్షించిన కమిషనర్, తక్కువ పురోగతి నమోదు చేసిన బూత్ లెవల్ అధికారులతో (బీఎల్వోలు) నేరుగా మాట్లాడి వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ప్రక్రియను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేసే విధంగా అవసరమైన మార్గదర్శకాలు అందించి పురోగతి మెరుగుపర్చాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఈఆర్వో వెన్నెల శ్రీను, సూపర్వైజర్లు, బీఎల్వోలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News