-మంత్రులు సవిత, బాలవీరాంజనేయ స్వామి
-బడుగు, బలహీన వర్గాల విద్యకు అధిక ప్రాధాన్యం
-ఇకపై హాస్టళ్లకు బదులు గురుకులాలు ఏర్పాటు : మంత్రి సవిత
-త్వరలో కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు
-ఏ ఎన్నికల్లోనైనా కూటమిదే విజయం తథ్యమన్న మంత్రి సవిత
-ఎస్సీ విద్యార్థులకు 3 ఎక్స్ లెన్స్ సెంటర్ల ఏర్పాటు : మంత్రి బాలవీరాంజనేయ స్వామి
-రూ.45 కోట్లతో టంగుటూరు ఎంజేపీ స్కూల్ కు శాశ్వత భవనం
-త్వరలో భూమి పూజ చేస్తామన్న బాలవీరాంజనేయ స్వామి
-రూ.65 లక్షలతో బీటీ రోడ్డును ప్రారంభించిన మంత్రులు
-సింగరాయకొండ నరసింహా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
కొండెపి/ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్ల ఖర్చు చేస్తోందని మంత్రులు సవిత, బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. త్వరలో అర్హులకు కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇకపై హాస్టళ్లకు బదులు గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. కొండేపి నియోజక వర్గంలోని సింగరాయకొండలో మంత్రులు పర్యటించారు. అక్కడ రూ.65 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం టంగుటూరు ఎంజేపీ గురుకుల బాలిక పాఠశాలకు శాశ్వత భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు సవిత, బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన సాగిస్తోందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడు గుర్రాల్లా పరుగులు తీయిస్తోందన్నారు. వీబీ రామ్ జీ పథకం ద్వారా వేల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. సింగరాయ కొండ ఎస్టీ కాలనీలో రూ.65 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డే దీనికి నిదర్శనమన్నారు.
త్వరలో పెన్షన్లు, ఇళ్ల స్థలాలు : మంత్రి సవిత
రాష్ట్రంలో బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు. రూ.500 కోట్ల సాస్కి నిధులతో ఎంజేపీ గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా టంగుటూరు ఎంజేపీ గురుకుల పాఠశాలకు శాశ్వత భవనాన్ని సమకూర్చనున్నట్లు తెలిపారు. ఇప్పటికే స్థలం సమకూర్చామని, రూ.45 కోట్లతో త్వరలో పనులు ప్రారంభించనున్నామని తెలిపారు. మొదటి విడతగా రూ.20 కోట్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో ఆరు ఎంజేపీ గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో హాస్టళ్లకు బదులు గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. గురుకులాల ఏర్పాటుతో నాణ్యమైన విద్యతో పాటు ఆహార భద్రతతో కూడిన రక్షణ విద్యార్థులకు లభిస్తుందన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి చేపట్టామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నామన్నారు. వాటితో పాటు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కూడా అందజేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికల్లోనైనా కూటమి విజయం తథ్యమని మంత్రి సవిత ధీమా వ్యక్తంచేశారు.
బడుగుల విద్యకు వేల కోట్లు కేటాయింపు
ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్య కోసం కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ.వేల కోట్లు వెచ్చించిందని మంత్రి డోలా బాల వీరాంజనేయులు తెలిపారు. రూ.500 కోట్లతో బీసీ గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రెండేళ్లలో ఎస్సీ హాస్టళ్లు, గురుకులాల మరమ్మతులు, నిర్మాణాలకు రూ.500 కోట్లకు పైగా వెచ్చించామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో మూడు ఎక్స్ లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులకు మరింత నైపుణ్యం పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. టంగుటూరు ఎంజేపీ స్కూల్ కు శాశ్వత భవన నిర్మాణానికి రూ.45 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
నమస్కారమండీ బాగున్నారా..?
హలో… నమస్కారమండీ బాగున్నారమ్మా..? మేం మంత్రులం మాట్లాడుతున్నామంటూ పే ఫోన్ ద్వారా విద్యార్థినుల తల్లిదండ్రులను మంత్రులు సవిత, డోలా బాలవీరాంజనేయ స్వామి పలుకరించారు. టంగుటూరు ఎంజేపీ స్కూల్లో బోధన బాగుందా… మీ పిల్లలు బాగా చదువుతున్నారా… నాణ్యమైన భోజనం పెడుతున్నారా… ? అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న తల్లికివందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందాయా… ఫ్రీ బస్ సౌకర్యం ఉపయోగించుకున్నారా..? అని విద్యార్థినుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. మంత్రులు సవిత, డోలా బాలవీరాంజనేయుల స్వామి టంగుటూరు ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లను, వంట గదిలోని నిత్యావసర సరుకుల పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని గతంలో కంటే అత్యుత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థినులకు మంత్రులు సవిత, బాలవీరాంజనేయులు దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థులకు స్పోర్ట్స్ ట్రాక్ షూట్లు, షూస్ అందజేశారు.
అంతకముందు మంత్రులు సవిత, డోలా బాలవీరాంజనేయుల స్వామి సింగరాయకొండలోని లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదాశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయానికి విచ్చేసిన మంత్రులకు ఆలయ నిర్వాహాకులు, అర్చకులు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా డా. నూకసాని బాలాజీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News