రామవరప్పాడు, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి బుధవారం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి, డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిజిటైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని సూచించారు.
కలెక్టర్ వెంట గన్నవరం నియోజకవర్గ ఈఆర్వో సమగ్ర శిక్ష ఏపీసి ఆర్ కుముదిని సింగ్, డిఆర్డిఎ పిడి హరిహరనాథ్, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News