-సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో కొనుగోలు
-రానున్న సీజన్‌లో ఎల్ నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం
-రూ.31 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలుతో 11.53 లక్షల మంది రైతులకు 24 గంటల్లో 95 శాతం చెల్లింపులు
-ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రైతులకు నమ్మకం, భరోసా కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తోందని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
స్థానిక గేట్ వే హోటల్ లో రెండేళ్లలో ధాన్యం సేకరణ ప్రగతి సమీక్ష సమావేశం పై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరణ చేపట్టామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, కూటమి ప్రభుత్వం రెండో ఏడాదిలోనే 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని మంత్రి వెల్లడించారు. రూ.31 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి, 11.53 లక్షల మంది రైతులకు 95 శాతం చెల్లింపులను 24 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేయడం చారిత్రక విజయమన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న 10 శాతం బ్రోకెన్ రైస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించడం రాష్ట్రానికి లభించిన గొప్ప గుర్తింపని ఆయన అన్నారు. ప్రతి ధాన్యం బస్తాకు క్యూఆర్ కోడ్, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం, వాట్సాప్ ద్వారా ధాన్యం నమోదు వంటి సాంకేతిక సంస్కరణలు పారదర్శకతను మరింత పెంచాయని తెలిపారు. గత సీజన్‌లో గన్నీ బ్యాగులు, గోదాములు, రవాణా వంటి అంశాల్లో ఎదురైన సమస్యలను గుర్తించి, ఈ ఖరీఫ్ నుంచి రైతు సేవా కేంద్రాల్లోనే గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచడం, రవాణా ఖర్చులను 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయడం వంటి కొత్త సంస్కరణలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. తేమ కొలతల్లో ఎలాంటి సందేహాలకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒకే కంపెనీ, ఒకే మోడల్ మాయిశ్చర్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 90 శాతం పని పూర్తైందని, ఖరీఫ్ నాటికి 100 శాతం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
ఎల్ నినో ప్రభావంతో వరి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులను ముందుగానే అప్రమత్తం చేసి, వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు, రైతు సంఘాలతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు చేపడతామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
సివిల్ సప్లైస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. కన్నబాబు మాట్లాడుతూ… గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ధాన్యం సేకరణ వ్యవస్థలో పలు కీలక సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. రైతులకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్లు కీలక భాగస్వాములని, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చామని, రైతులకు సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం (పబ్లిక్ పర్సెప్షన్) పెరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సూచిక పెరిగేలా కృషి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో మన పనితీరు, పారదర్శకత, సేవా నిబద్ధతే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాయని, అదే మన పనితీరుకు నిజమైన నిదర్శనమని కన్నబాబు పేర్కొన్నారు.
సివిల్ సప్లైస్ కమిషనర్ డిల్లీ రావు మాట్లాడుతూ.. దేశంలోనే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ధాన్యం సేకరణ జరిపిందని రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ధాన్యం సేకరణను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తోందని సివిల్ సప్లైస్ కమిషనర్ డిల్లీ రావు తెలిపారు. 2023–24తో పోలిస్తే ధాన్యం సేకరణ 74 శాతం పెరిగి, మొత్తం 74 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. ఖరీఫ్‌లో 63 శాతం, రబీలో 100 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. ఈ విజయానికి అధికారులు, జిల్లా యంత్రాంగం, రైస్ మిల్లర్లు, రవాణా సిబ్బంది సమష్టి కృషే కారణమని ఆయన అభినందించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు, సకాలంలో సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో మరింత సమర్థవంతంగా ధాన్యం సేకరణ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డిల్లీ రావు పేర్కొన్నారు.
ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ (రీజినల్ ఆఫీస్ ఏపీ) విజయ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం సేకరణలో అమలు చేస్తున్న సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. మెరుగైన వరి పథకం అమలులో రాష్ట్రం ముందంజలో ఉందని, 10 వేల మెట్రిక్ టన్నుల పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ధాన్యం బస్తాలకు క్యూఆర్ కోడ్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని చెప్పారు. ఈ విజయానికి రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లైస్ శాఖ అధికారులు, ఎఫ్‌సీఐ, రైస్ మిల్లర్లు సమష్టిగా కృషి చేశారని యాదవ్ అభినందించారు.
కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు.. ప్రొక్యూర్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి దృష్టికి రైతులు తీసుకొచ్చారు. బ్యాంకర్లు విషయం లో ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టి లో పెట్టీ పరిష్కరిస్తామని, రైతులు చెప్పిన విషయాలు పరిగణలోకి తీసుకుంటామని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ సత్యన్నారాయణ మాట్లాడుతూ… వేసే పంట రకాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అదేవిధంగా ఇప్పుడు పండిస్తున్న వరి ధాన్యాలు మేలు రకానికి చెందడంతోపాటు అధిక దిగుబడిని ఇచ్చేవిగా ఉన్నాయన్నారు. కృష్ణా, గోదావారి డెల్టా ప్రాంతాల్లో ఎల్ నినో ప్రభావం ఉండకపోవచ్చని, వేరే ప్రాంతాల్లో దీని ప్రభావం ఉండవచ్చన్నారు. ఎల్ నినోకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచార బులెటెన్స్ ను అందిస్తున్నామన్నారు. వరి ధాన్యం సేకరణలో ప్రతిభ కనబరచిన అధికారులను మంత్రి సత్కరించారు.
కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ నుపూరు అజయ్ కుమార్, కృష్ణా జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్, వెస్ట్ గోదావరి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, నెల్లూరు జాయింట్ కలెక్టర్ ఎమ్. వెంకటేశ్వర్లు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News