-ప్రమాదంలో మచిలీపట్నం వాసి మరణం అత్యంత బాధాకరం
-బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ
-మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వియాత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించిన వార్త కలచివేసింది. మచిలీపట్నంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గెల్లి కిషోర్ భార్య జయశ్రీ మరణించడం అత్యంత బాధాకరం. తీవ్ర అస్వస్థతకు గురైన కిశోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి, వారి పరిస్థితిపై ఆరా తీశారు. బాధిత కుటుంబ సభ్యులు వియత్నాం వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున చేపడతామని హామీ ఇచ్చారు. అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
Prajavartha Online Telugu News