-117 వరద గేట్ల మార్పిడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శ్రీకారం
-గోదావరి డెల్టా భద్రత, సాగునీటి భవిష్యత్తుకు చారిత్రాత్మక అడుగు
ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉభయ గోదావరి జిల్లాల వ్యవసాయ, తాగునీటి అవసరాలకు దాదాపు రెండు శతాబ్దాలుగా జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. సుమారు ₹152.95 కోట్ల వ్యయంతో 117 పాత వరద గేట్ల స్థానంలో అత్యాధునిక వరద గేట్ల ఏర్పాటు పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో పిచ్చుకలంక గేట్ నెంబర్ ఒకటి వద్ద శంకుస్థాపన చేయనున్నారు.
గోదావరి డెల్టా సాగునీటి భద్రత, ఆనకట్ట దీర్ఘకాలిక సంరక్షణ దిశగా ఇది అత్యంత కీలకమైన మైలురాయిగా అధికారులు పేర్కొంటున్నారు.
1847లో ప్రారంభమై 1852లో పూర్తయిన ధవళేశ్వరం ఆనకట్టతో గోదావరి జలాలను సక్రమంగా వినియోగించేందుకు మార్గం సుగమమైంది. అప్పటి వరకు సముద్రంలో కలిసిపోయే వరద జలాలను వ్యవసాయానికి మళ్లించి, గోదావరి డెల్టాను దేశంలోనే అత్యంత సారవంతమైన ప్రాంతాల్లో ఒకటిగా తీర్చిదిద్దడంలో సర్ ఆర్థర్ కాటన్ పాత్ర చారిత్రాత్మకంగా నిలిచింది. ఈ కృషికి గుర్తింపుగా గోదావరి ప్రాంత రైతులు నేటికీ ఆయనను కృతజ్ఞతాభావంతో స్మరిస్తుంటారు.
కాలక్రమేణా పాత ఆనకట్ట వయోభారానికి లోనవడంతో, 1963 వరదల అనంతరం ఆధునిక బ్యారేజీ నిర్మాణ అవసరం ఏర్పడింది. 1969లో ప్రారంభమైన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నిర్మాణం 1984లో పూర్తయింది.
దాదాపు 5.837 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్యారేజీ ప్రస్తుతం 10.13 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు లక్షలాది మంది ప్రజలకు తాగునీటి ప్రధాన ఆధారంగా కొనసాగుతోంది. వరద నియంత్రణ, డెల్టా వ్యవసాయ పరిరక్షణలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తోంది.
నాలుగు దశాబ్దాలుగా నిరంతర వినియోగం, భారీ వరదల ఒత్తిడి, యాంత్రిక భాగాల సహజ శిథిలీకరణ నేపథ్యంలో బ్యారేజీ భద్రతపై కేంద్ర జల సంఘం (CWC), డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (DSRP), హైడ్రో-మెకానికల్ నిపుణుల కమిటీలు పలు దఫాలు పరిశీలనలు నిర్వహించాయి. వాటి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది.
2014-15లో తొలి దశలో 175 వరద గేట్లలో 58 గేట్లను రూ.31.77 కోట్లతో మార్చగా, ఇప్పుడు మిగిలిన 117 గేట్ల మార్పిడి, అన్ని 175 గేట్లకు కొత్త రబ్బర్ సీల్స్, రోలర్ అసెంబ్లీలు, వైర్ రోపులు, మాస్టర్ కంట్రోల్ ప్యానెల్స్, విద్యుత్ కేబుళ్ల మార్పిడి, శాండ్ బ్లాస్టింగ్, పెయింటింగ్ వంటి సమగ్ర పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
ప్రభుత్వం 2025లో ఈ పనులకు పరిపాలనా అనుమతి మంజూరు చేయగా, సాంకేతిక ఆమోదం అనంతరం M/s BEKEM Infra Projects Pvt. Ltd., హైదరాబాద్ సంస్థకు పనులు అప్పగించారు. రెండు సంవత్సరాల్లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రాజెక్టు అమలవుతోంది.
ఈ కార్యక్రమం కేవలం గేట్ల మార్పిడితో పరిమితం కాకుండా, గోదావరి డెల్టా భవిష్యత్తుకు భద్రత కల్పించే దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తున్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల రైతాంగంతో పాటు మత్స్యకారులు, గ్రామీణ ప్రజల జీవనోపాధి మరింత స్థిరపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇటీవల ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన గోదావరి ప్రాంత వారసత్వ సంపద సంరక్షణ దిశగా కూడా ఈ ఆధునీకరణ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది. చారిత్రక విలువ కలిగిన బ్యారేజీ నిర్మాణ వారసత్వాన్ని పరిరక్షిస్తూనే, ఆధునిక సాంకేతికతతో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే ప్రయత్నంగా దీనిని భావిస్తున్నారు.
సర్ ఆర్థర్ కాటన్ సృష్టించిన జలవనరుల వారసత్వాన్ని సంరక్షిస్తూ, భవిష్యత్ తరాలకు సురక్షితమైన సాగునీటి వ్యవస్థను అందించాలనే లక్ష్యంతో చేపడుతున్న ఈ కార్యక్రమం గోదావరి డెల్టా చరిత్రలో మరో సువర్ణ అధ్యాయంగా నిలవనుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Prajavartha Online Telugu News