శస్త్ర చికిత్స అయిపోయింది… వెంటనే విధుల్లోకి వచ్చేస్తానంటున్నారు

-శస్త్ర చికిత్స అనంతరం తగిన విశ్రాంతి అవసరం అని పవన్ కళ్యాణ్ కి సూచించాను
-మూడు వారాల ఫిజియోథెరపీ ఉంటుందని వైద్యులు తెలిపారు
-ఆరు నెలల తర్వాత రెండో భుజానికి పరీక్షలు చేస్తారు
-పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం నిలకడగా ఉంది
-ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య వివరాలను అన్నా కొణిదలని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
-పవన్ కళ్యాణ్ ని ముంబయి ఆస్పత్రిలో పరామర్శించిన ముఖ్యమంత్రి… అనంతరం మీడియాకు వివరాలు వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘ప్రజా క్షేత్రంలోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతనోత్సాహంతో, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారు. ఆయనకు చాలా కీలకమైన శస్త్ర చికిత్స జరిగింది. మూడున్నర గంటలపాటు అత్యున్నత వైద్యుల బృందం విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఏళ్ల తరబడి ఉన్న తీవ్రమైన గాయాన్ని ఆయన ప్రజాసేవలో నిమగ్నమై నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు శస్త్రచికిత్స విజయవంతం కావడంతో, ఆయన పూర్తిగా కోలుకుంటున్నార’ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి కావడంతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ ఆస్పత్రిలో వైద్యల పర్యవేక్షణలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ని ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్ పరామర్శించారు. ముఖ్యమంత్రి వచ్చే సమయానికి ఆస్పత్రిలోనే ఉన్న మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, చంద్రబాబు ని వైద్యుల పర్యవేక్షణలో ఉన్న పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకొని వెళ్లారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో, ఆయన సతీమణి అన్నా కొణిదలతో ప్రత్యేకంగా మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులతోనూ చంద్రబాబు మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వద్దనే మీడియా ప్రతినిధులతో చంద్రబాబు  మాట్లాడుతూ… ‘‘ఏళ్ల తరబడి రెండు భుజాలకు ఉన్న తీవ్రమైన గాయాలను ప్రజా సేవలో నిమగ్నమై  పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. చిన్న చిన్న విషయాలను పవన్ కళ్యాణ్ పట్టించుకోరు. ప్రజల్లో ఉన్నపుడు, పర్యటనల సమయంలో ఆయన మీదకు అభిమానులు ఆప్యాయంగా దూసుకురావడం, చేతులు పట్టుకొని పక్కకు లాగడం, తోపులాట వల్ల భుజాలకు ఉన్న సమస్య తీవ్రమైంది. ఇటీవల ఆయన వైద్య పరీక్షలకు వచ్చిన సమయంలోనే సమస్య తీవ్రమైనదిగా గుర్తించి, వెంటనే కుడి భుజానికి శస్త్ర చికిత్స అవసరం అని డాక్టర్లు చెప్పారు. కుడి భుజానికి ఆపరేషన్ విజయవంతం అయింది. దాని తర్వాత వైద్యుల పర్యవేక్షణ, ఫిజియోథెరపీ వంటివి ఉంటాయి. 3 వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలో, ఫిజియోథెరపీ చేయడం వల్ల భుజానికి ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. రెండో భుజానికి కూడా సమస్య ఉందని వైద్యులు తెలిపారు. కుడి భుజానికి ఉన్న సమస్య తీరిన తర్వాత 6 నెలలు వేచి చూసి, మళ్లీ వైద్యులు పరీక్షలు చేస్తారు. అప్పుడు ఎడమ భుజానికి ఆపరేషన్ అవసరం అవుతుందా..? లేక ఫిజియోథెరపీతో పరిష్కారం అవుతుందా అన్నది తేలుతుంది. పవన్ కళ్యాణ్ మునుపటి ఉత్సాహంతో, పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలోకి తిరిగి వస్తారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం చాలా నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది” అని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *