అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రెండవ దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ కేలండర్ తయారి సన్నద్ధతపై సోమవారం ఎపి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధ్యక్షతన కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రెండవ దశ జాబ్ కేలండర్ కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ ఇ-హెచ్ఆర్ఎం,లోకల్ కేడర్ ఆర్గనైజేషన్ కు అనుగుణంగా నోటిఫికేషన్, నూతన లోకల్ కేడర్లలో పోస్టుల కేటాయింపు నోటిఫికేషన్,అన్ని కేడర్లలో ప్రాధాన్యత కేటగిరీలకు సంబంధించి సీనియారిటీ జాబితా ప్రిపరేషన్,ఎలాంట్మెంట్ ఆఫ్ పెర్సన్స్, ఓపెనింగ్ ఆఫ్ రోస్టర్స్, ఎపిపిఎస్సి ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీలకు ఇండెంట్స్ పంపడం తదితర అంశాలపై సమీక్షించారు. ఈప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని కార్యదర్శులు, హెచ్ఓడిలను ఆదేశించారు. అంతేగాక బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అన్ని అంశాల్లో ఉద్యోగులతో పూర్తి స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న వివిధ క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన కేసుల పరిష్కారనికి ఇదే సరైన సమయమని కావున 6నెలల వ్యవధిలోపు పరిష్కరించాల్సిన కేసులన్నిటినీ వేగవంతంగా పరిష్కరించాలని సిఎస్ సాయి ప్రసాద్ ఆదేశించారు.
అంతకు ముందు సర్వీసెస్ మరియు హెచ్ఆర్ఎం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ రెండవ దశ జాబ్ కేలండర్ కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్,కంప్లీషన్ ఆఫ్ ఇ-హెచ్ఆర్ఎం,లోకల్ కేడర్ ఆర్గనైజేషన్ కు అనుగుణంగా నోటిఫికేషన్,నూతన లోకల్ కేడర్లలో పోస్టుల కేటాయింపు నోటిఫికేషన్ తదితర అంశాలకు సంబంధించిన టైమ్లైన్ ను వివరించారు. ఆనిర్దేశిత టైమ్ లైన్ ప్రకారం ఉద్యోగుల కేటాయింపు తదితర చర్యలు పూర్తి చేయాలని ఇందుకు సంబంధించిన జిఓలను వెంటనే జారీ చేయడం జరుగుతుందని చెప్పారు.
ఈసమావేశంలో స్పెషల్ సిఎస్ లు బి.రాజ శేఖర్, కృష్ణ బాబు, జి.జయలక్మి, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖాధిపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News