ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి డిజిటల్ విద్యకు శ్రీకారం

-పూర్తి పారదర్శకతతో అత్యాధునిక Google Gemini AI ఆధారిత Chromebook ల కొనుగోలు
సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి డిజిటల్ విద్యకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రపంచ స్థాయి డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI), డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక అభ్యాస విధానాలను ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసిందన్నారు.

డిజిటల్ విద్యలో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు…
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచ స్థాయి డిజిటల్ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రజాధనాన్ని బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, పూర్తి పారదర్శకతతో, అన్ని చట్టబద్ధ నిబంధనలను పాటిస్తూ అత్యాధునిక సాంకేతికతను ప్రభుత్వ విద్యలో ప్రవేశపెట్టడం ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి నాణ్యమైన డిజిటల్ విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, భవిష్యత్ పోటీ ప్రపంచంలో మరింత సమర్థులుగా ఎదగడానికి అవకాశం కలుగుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోందని ఆయన తెలిపారు.

పూర్తిస్థాయి పారదర్శకతతో Chromebook పరికరాల కొనుగోలు ప్రక్రియ…
ఈ లక్ష్యంతో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు అత్యాధునిక Google Gemini AI ఆధారిత Chromebook పరికరాల కొనుగోలు ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన, చట్టబద్ధత మరియు పోటీ విధానాలకు అనుగుణంగా విజయవంతంగా నిర్వహించిందన్నారు. ఈ కొనుగోలు ప్రక్రియలో ప్రతి దశను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆర్థిక నిబంధనలు, విజిలెన్స్ ప్రమాణాలు మరియు ప్రజాధన వినియోగంలో అనుసరించాల్సిన అత్యున్నత ప్రమాణాలకు లోబడి అమలు చేయడం జరిగిందన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పూర్తిస్థాయి పారదర్శక టెండర్ ప్రక్రియ…
Chromebookల కొనుగోలు కోసం రూపొందించిన టెండర్ ప్రక్రియ General Financial Rules (GFR)-2017, Public Procurement (Preference to Make in India) Order-2017, Central Vigilance Commission (CVC) మార్గదర్శకాలు, Government e-Marketplace (GeM) నిబంధనలు, Request for Proposal (RFP)లో పొందుపరిచిన అన్ని షరతులను పూర్తిగా అనుసరిస్తూ నిర్వహించబడిందన్నారు. టెండర్ ప్రక్రియ ప్రారంభం నుంచి ఒప్పందాల ఖరారు వరకు ప్రతి దశలో సమాన అవకాశాలు, పోటీ స్ఫూర్తి, పారదర్శకత మరియు నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడిందని ఆయన తెలిపారు.

అర్హత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేదు…
టెండర్ ప్రక్రియలో వివిధ సంస్థలు ప్రీ-బిడ్ సమావేశాల్లో చేసిన సాంకేతిక సూచనలు, వివరణల అభ్యర్థనల ఆధారంగా మాత్రమే కొన్ని స్పష్టీకరణలు Corrigendumల ద్వారా జారీ చేయబడ్డాయన్నారు. ఈ మార్పులన్నీ GeM పోర్టల్‌లో అందరికీ ఒకేసారి అందుబాటులో ఉంచబడ్డాయని, ఏ సంస్థకు ప్రత్యేక ప్రయోజనం కల్పించే విధంగా గానీ, ఏ సంస్థను అనర్హంగా చేసే విధంగా గానీ నిబంధనల్లో మార్పులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా, గత పనితీరు (Past Performance), వార్షిక టర్నోవర్, Solvency Certificate వంటి కీలక అర్హత ప్రమాణాల్లో సడలింపులు ఇవ్వాలన్న కొన్ని అభ్యర్థనలను ప్రభుత్వం తిరస్కరించడం ద్వారా నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడలేదనే విషయం స్పష్టమవుతోందన్నారు.

‘మేక్ ఇన్ ఇండియా’ విధానానికి సంపూర్ణ ప్రాధాన్యత…
దేశీయ తయారీకి ప్రోత్సాహం కల్పించే కేంద్ర ప్రభుత్వ Make in India విధానాన్ని ఈ కొనుగోలు ప్రక్రియలో పూర్తిగా అమలు చేయడం జరిగిందన్నారు. కొనుగోలు చేయబడిన Chromebookలు తప్పనిసరిగా భారతదేశంలో తయారైనవే కావాలని, BIS ప్రమాణాలు కలిగి ఉండాలని స్పష్టమైన నిబంధనలు విధించబడ్డాయన్నారు. ధృవీకరణ పత్రాల సమర్పణకు సంబంధించిన పరిపాలనా సవరణలు మాత్రమే చేపట్టబడ్డాయి తప్ప, Make in India విధానానికి సంబంధించిన ఏ నిబంధన కూడా సడలించబడలేదని ఆయన తెలిపారు.

ప్రమాణిత ప్రభుత్వ కొనుగోలు విధానంలోనే సరఫరా విభజన…
భారీ స్థాయి ప్రభుత్వ సమాచార సాంకేతిక (ICT) కొనుగోళ్లలో సరఫరా అంతరాయాలు తలెత్తకుండా ఉండేందుకు, ఒకే సరఫరాదారుపై ఆధారపడకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న ప్రామాణిక విధానం ప్రకారం 70:30 సరఫరా విధానాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. ఈ విధానం టెండర్ ప్రారంభ దశలోనే RFPలో స్పష్టంగా పేర్కొనబడిందని, పోటీ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎటువంటి కొత్త నిబంధనలు చేర్చలేదని ఆయన తెలిపారు.

పరికరం మాత్రమే కాదు… సమగ్ర డిజిటల్ విద్యా పరిష్కారం…
ఈ కొనుగోలు కేవలం Chromebook పరికరాల సమీకరణకే పరిమితం కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్ర డిజిటల్ విద్యా వాతావరణాన్ని నెలకొల్పే సమీకృత (Integrated) విద్యా పరిష్కారం అని ఆయన తెలిపారు. ఇందులో ప్రతి పరికరంతో పాటు Google Gemini Enterprise for Education AI లైసెన్స్, Chrome Education Upgrade, మూడు సంవత్సరాల డివైస్ మేనేజ్‌మెంట్, రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 3,459 ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్‌స్టాలేషన్, కమిషనింగ్, LEAP బ్రాండింగ్, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ, ఆన్‌సైట్ వారంటీ, సాంకేతిక సహాయ సేవలు వంటి అన్ని సదుపాయాలు ఒకే ప్యాకేజీగా అందించబడుతున్నాయన్నారు. అందువల్ల ఈ కొనుగోలును కేవలం హార్డువేర్ ధరతో మాత్రమే పోల్చడం సముచితం కాదని, ఇందులో అంతర్భాగంగా ఉన్న ఆధునిక సాప్టువేర్, కృత్రిమ మేధస్సు ఆధారిత విద్యా సేవలు, శిక్షణ, నిర్వహణ, సాంకేతిక మద్దతు వంటి సమగ్ర సేవలను పరిగణనలోకి తీసుకున్నప్పుడే వాస్తవ వ్యయం, దాని విలువ మరియు విద్యా ప్రయోజనం స్పష్టమవుతుందని ఆయన తెలిపారు.

పోటీ ధరతో అత్యాధునిక సాంకేతికత…
ఇతర రాష్ట్రాల్లో అమలైన కొనుగోళ్లతో పోల్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందిన సమగ్ర ఒప్పంద ధర అత్యంత ఆర్థికంగా ప్రయోజనకరమైనదిగా నిలిచిందన్నారు. అదనంగా ఇతర కొనుగోళ్లలో లేని Google Gemini Enterprise AI, Device Management, Installation, Teacher Enablement వంటి విలువ ఆధారిత సేవలు కూడా ఇందులో భాగమయ్యాయన్నారు. ప్రజాధనాన్ని అత్యంత సమర్థవంతంగా వినియోగిస్తూ, తక్కువ వ్యయంతో అధిక ప్రయోజనం పొందే విధంగా ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను రూపకల్పన చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వ విద్యలో AI యుగానికి నాంది…
ఈ Chromebookల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రపంచ స్థాయిలో వినియోగంలో ఉన్న అత్యాధునిక Google Gemini AI ఆధారిత డిజిటల్ విద్యా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వ్యక్తిగత అభ్యాస సామర్థ్యానికి అనుగుణంగా పాఠ్యాంశాలను అర్థమయ్యేలా వివరణలు అందించడం, గణితం, సైన్స్ వంటి క్లిష్టమైన అంశాలను సులభతరం చేయడం, బహుభాషా అభ్యాసానికి తోడ్పాటు అందించడం, 24 గంటల AI ఆధారిత అభ్యాస సహాయకుడిగా పనిచేయడం, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసాన్ని ప్రోత్సహించడం, విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం వంటి అనేక ప్రయోజనాలు ఈ సాంకేతికత ద్వారా లభిస్తాయని ఆయన తెలిపారు.

ఉపాధ్యాయులకు సాంకేతిక సహాయకుడిగా Gemini AI…
Gemini AI ద్వారా ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికలు, వర్కుషీట్లు, ప్రశ్నాపత్రాలు, క్విజ్‌లు, డిజిటల్ లెర్నింగ్ కంటెంట్‌ను అత్యంత వేగంగా రూపొందించుకోవచ్చన్నారు. దీనివల్ల పరిపాలనా పనులపై వెచ్చించే సమయం తగ్గి విద్యార్థుల బోధన, అభ్యాస నాణ్యత పెరుగుతుందని తెలిపారు.

తక్కువ నిర్వహణ వ్యయం – ఎక్కువ విద్యా ప్రయోజనం…
Chromebookలు తక్కువ విద్యుత్ వినియోగం, తక్కువ నిర్వహణ వ్యయం, వేగవంతమైన పనితీరు, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, క్లౌడ్ ఆధారిత నిర్వహణ వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయన్నారు. దీని వల్ల ప్రభుత్వం భవిష్యత్ నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు అదే బడ్జెట్‌తో మరిన్ని ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తరించే అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు.

భద్రత, పారదర్శకత, కేంద్రస్థాయి పర్యవేక్షణ…
Chromebookల్లో అధునాతన భద్రతా వ్యవస్థలు, వైరస్ రక్షణ, కేంద్రస్థాయి Device Management, విద్యార్థుల డేటా భద్రత, నియంత్రిత వెబ్ యాక్సెస్ వంటి సౌకర్యాలు అంతర్నిర్మితంగా ఉంటాయన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఒకే కేంద్రం నుంచి అన్ని పరికరాల వినియోగాన్ని పర్యవేక్షిస్తూ విద్యార్థులకు సురక్షితమైన డిజిటల్ విద్యా వాతావరణాన్ని కల్పించగలదని ఆయన తెలిపారు.

విద్యార్థుల విజ్ఞానం, నైపుణ్యం, భవిష్యత్ ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి…
విద్యార్థులను భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి సన్నద్ధం చేయడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన డిజిటల్ విద్యా వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పూర్తి పారదర్శకత, చట్టబద్ధత, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక Google Gemini AI ఆధారిత Chromebookలను అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రభుత్వ విద్యను సాంకేతికంగా మరింత బలోపేతం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రపంచ స్థాయి డిజిటల్ విద్యా సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పాటు, వారి విజ్ఞానాన్ని, నైపుణ్యాలను, భవిష్యత్ ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచే అవకాశం కలుగుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *