-రాష్ట్ర వ్యాప్తంగా 422 కార్యక్రమాలు.. 1.60 లక్షల మందికి పైగా విద్యార్థులు, పౌరుల భాగస్వామ్యం
-మిల్లెట్స్ ప్రదర్శనలు, కిచెన్ గార్డెనింగ్పై విస్తృత అవగాహన
-పాఠశాల విద్య సంచాలకులు ఎ. తమీమ్ అన్సారియా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు’లో భాగంగా నాల్గో రోజైన బుధవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ‘సుస్థిర ఆహార వ్యవస్థలు’ (Sustainable Food Systems) అనే అంశంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మిషన్ లైఫ్ (LiFE) లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ, పోషకాహార అలవాట్లను పెంపొందించడమే ధ్యేయంగా విద్యార్థులకు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చిరుధాన్యాలు (మిల్లెట్స్), సంప్రదాయ పోషకాహార పదార్థాల ప్రదర్శనలు నిర్వహించారు. ఆహార వృథాను అరికట్టడం, వ్యర్థ పదార్థాలతో కంపోస్టింగ్ తయారీ, పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెనింగ్ (తోటల పెంపకం) ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్య సంచాలకులు ఎ. తమీమ్ అన్సారియా, I.A.S. మాట్లాడుతూ… వారం రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 422 కార్యక్రమాలు.. 1.60 లక్షల మందికి పైగా విద్యార్థులు, పౌరుల భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. నాలుగో రోజు నిర్వహించిన కార్యక్రమాల వివరాలు, ఫొటోలను తప్పనిసరిగా https://ecoclubs.education.gov.in/ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలను జిల్లా స్థాయిలో డీఈఓలు, సమగ్ర శిక్ష ఏపీసీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, వారం ముగిసిన అనంతరం సమగ్ర నివేదికను రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమాల అమలు తీరును పరిశీలిస్తున్నందున ప్రతి పాఠశాల భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
