Breaking News

షైనింగ్ స్టార్‌.. ప్ర‌తిభ‌కు ప‌ట్టం!

– జిల్లాలో 175 మందికి షైనింగ్ స్టార్స్ పుర‌స్కారాలు
– మెరిసిన విద్యాతార‌లు.. స్వ‌ర్ణాంధ్ర‌కు వార‌ధులు
– విక‌సిత్ భార‌త్ సాకారానికి కీల‌క భాగ‌స్వాములు
– ప్ర‌భుత్వ ప్రోత్సాహంతో దేశానికి ఆద‌ర్శ‌వంతులుగా ఎద‌గాలి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియెట్‌లో అత్యుత్త‌మ మార్కులు సాధించిన విద్యార్థుల‌ను షైనింగ్ స్టార్స్ పుర‌స్కారాల‌తో ప్ర‌తిభ‌కు ప‌ట్టంక‌డుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంద‌ని.. ఈ చేయూత‌తో భ‌విష్య‌త్తులో దేశానికి ఆద‌ర్శ‌వంతులుగా ఎద‌గాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
పాఠ‌శాల విద్య‌, స‌మ‌గ్ర‌శిక్ష‌, ఇంట‌ర్మీడియెట్ విద్యాశాఖ‌ల ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా సోమ‌వారం న‌గ‌రంలోని మారిస్ స్టెల్లా క‌ళాశాల ఆడిటోరియంలో షైనింగ్ స్టార్స్ ప్ర‌తిభా పుర‌స్కారాలు-2026 కార్య‌క్ర‌మం జ‌రిగింది. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ‌మోహ‌న్, 20 సూత్రాల అమ‌లు క‌మిటీ ఛైర్మ‌న్ లంకా దిన‌క‌ర్, ఏపీ కుమ్మ‌రి, శాలివాహ‌న సంక్షేమం, అభివృద్ధి కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ పి.ఈశ్వ‌ర్‌, జిల్లా గ్రంథాల‌య సంస్థ ఛైర్మ‌న్ ఎం.ఎస్‌.బేగ్ త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో అత్యుత్త‌మ మార్కులు సాధించిన 135 మందితో పాటు ఇంట‌ర్‌లో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన మ‌రో 40 మంది విద్యార్థుల‌కు రూ. 20 వేల న‌గ‌దు బ‌హుమ‌తితో పాటు ప‌త‌కం, స‌ర్టిఫికెట్ అందించి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ తాను ఐదో తరగతి చదువుతున్నప్పుడు మంచి మార్కులు సాధించినందుకు బహుమతిగా ఒక డిక్షనరీ అందుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఆ డిక్షనరీని తన తల్లికి చూపించినప్పుడు ఆమె ముఖంలో కనిపించిన ఆనందం తన జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయిందన్నారు. ఆ ఆనందాన్ని ఎప్పటికీ నిలబెట్టాలనే సంకల్పమే తనను ఐఏఎస్‌గా తీర్చిదిద్దిందని చెప్పారు. ప్ర‌భుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహంతో మ‌రింత మంది షైనింగ్ స్టార్‌లుగా ఎద‌గాల‌ని.. దీర్ఘ‌కాలంలో మ‌రిన్ని విజ‌యాలు సొంతం చేసుకోవాల‌ని ఆకాంక్షించారు. ఇంత మంచి అవకాశం క‌ల్పిస్తున్న గౌర‌వ ముఖ్య‌మంత్రి, గౌర‌వ విద్యాశాఖ మంత్రివ‌ర్యులకు విద్యార్థుల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు.
స‌భాధ్య‌క్షులు, శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ‌మోహ‌న్ మాట్లాడుతూ షైనింగ్ స్టార్స్ అంద‌రికీ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాన‌ని.. విద్య‌తోనే ఒక కుటుంబం ద‌శ‌, దిశ మారుతుంద‌ని, అందుకే గౌర‌వ ముఖ్య‌మంత్రి, గౌర‌వ విద్యాశాఖ మంత్రివ‌ర్యులు విద్యారంగం అభివృద్ధికి విశేష కృషిచేస్తున్నార‌న్నారు. గౌర‌వ సీఎం మొద‌ట్నుంచీ మ‌హిళా శ‌క్తి సాధికార‌త‌కు పెద్ద‌పీట వేస్తున్నార‌ని, నేటి షైనింగ్ స్టార్స్‌లో ఎక్కువ‌మంది అమ్మాయిలే ఉండ‌టం ఆ కృషి ఫ‌లిత‌మేన‌ని పేర్కొన్నారు. యువశ‌క్తి దేశాభివృద్ధికి ప్ర‌ధానమ‌ని, యువ‌త చెడు అల‌వాట్ల వైపు వెళ్ల‌కుండా బాగా చ‌దువుకొని ఉన్న‌తంగా ఎద‌గాల‌ని శాస‌న‌స‌భ్యులు సూచించారు.
20 సూత్రాల అమ‌లు క‌మిటీ ఛైర్మ‌న్ లంకా దిన‌క‌ర్ మాట్లాడుతూ.. దేశాన్ని 2047 నాటికి విశ్వ‌గురుగా మార్చేందుకు గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను దేశంలో ముందంజ‌లో నిల‌ప‌డానికి స్వ‌ర్ణాంధ రూప‌క‌ల్ప‌న‌కు గౌర‌వ సీఎం కృషిచేస్తున్నార‌న్నారు. దేశ స‌మ‌గ్రాభివృద్ధికి అత్యుత్త‌మ మాన‌వ వ‌న‌రులు కీల‌క‌మ‌ని.. అందుకే నూత‌న జాతీయ విద్యావిధానం తెచ్చార‌న్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ద్వారా అత్యుత్త‌మ విద్య‌ను అందించేందుకు కృషిచేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. వీటిని స‌ద్వినియోగం చేసుకుంటూ షైనింగ్ స్టార్స్ విక‌సిత్ భార‌త్, స్వ‌ర్ణాంధ్ర నిర్మాణంలో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు.
*ఏపీ కుమ్మ‌రి, శాలివాహ‌న సంక్షేమం, అభివృద్ధి కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ పి.ఈశ్వ‌ర్‌, జిల్లా గ్రంథాల‌య సంస్థ ఛైర్మ‌న్ ఎం.ఎస్‌.బేగ్.. ఇంత మంచి కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌ని.. ఇంత‌టితో ఆగ‌కుండా ఈ విజ‌యం స్ఫూర్తితో స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొని వాటి సాకారానికి కృషిచేయాల‌ని విద్యార్థుల‌కు సూచించారు.
కార్య‌క్ర‌మంలో జిల్లా ఇంట‌ర్మీడియెట్ అధికారి బి.ప్ర‌భాక‌ర‌రావు, స‌మ‌గ్ర‌శిక్ష ఏపీసీ ఆర్‌.ర‌మేష్‌బాబు, మారిస్ స్టెల్లా క‌ళాశాల నుంచి డా. సిస్టర్ ఇన్యాస‌మ్మ‌, జిల్లా విద్యాశాఖ, స‌మ‌గ్ర‌శిక్ష అధికారులు, సిబ్బంది సూరిబాబు, జీవీ ర‌మ‌ణ‌, షేక్ ఉమ‌ర్ అలీ, కె.పిచ్చేశ్వ‌ర‌రావు, జె.శ్రీనివాస‌రావు, అశోక్‌బాబు, ఏవీవీ ప్ర‌సాద‌బాబు, విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *