Breaking News

విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యం

-కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌పై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్
-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఐ.ఏ.ఎస్.,

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల కెరీర్ ప్రణాళిక, మానసిక ఆరోగ్యం, సమగ్రాభివృద్ధిని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ లో భాగంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ), సైకోమెట్రిక్ టూల్ ప్రమాణీకరణపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ ను గురువారం విజయవాడలోని వైఈఎస్-జే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాస్ రావు, ఐఏఎస్ మాట్లాడుతూ, విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు వారి మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, కెరీర్ ప్రణాళికలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మార్గదర్శకత్వంలో 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులకు సైకోమెట్రిక్ అసెస్‌మెంట్‌లు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.

సైకోమెట్రిక్ టూల్ ద్వారా విద్యార్థులను అర్థం చేసుకోవాలి

సైకోమెట్రిక్ టూల్ ద్వారా విద్యార్థుల ఆసక్తులు, సామర్థ్యాలు, వ్యక్తిత్వ లక్షణాలు, కెరీర్ ఆకాంక్షలు, భావోద్వేగ స్థితిని శాస్త్రీయంగా అంచనా వేసి, వారికి సరైన సమయంలో సరైన కెరీర్ మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్ అందించవచ్చని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులు విద్యాపరమైన ఒత్తిడి, పోటీ, ఆందోళన, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాఠశాలలు విద్యాబోధనతో పాటు వారి మెంటల్ హెల్త్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న సైకోమెట్రిక్ టూల్ శాస్త్రీయంగా, విశ్వసనీయంగా, విద్యార్థులకు అనుకూలంగా ఉండటంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సులభంగా అమలు చేసే విధంగా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) ద్వారా అసెస్‌మెంట్ నిర్వహణ, విద్యార్థుల సమాచారం గోప్యత, కౌన్సెలింగ్ విధానం, అవసరమైన వారికి నిపుణుల సేవలు అందించే రిఫరల్ వ్యవస్థ, సంబంధిత అధికారుల బాధ్యతలు తదితర అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. వర్క్‌షాప్‌లో సైకోమెట్రిక్ టూల్ రూపకల్పన, కెరీర్ గైడెన్స్, విద్యార్థుల మెంటల్ హెల్త్, కౌన్సెలింగ్ విధానాలు, రిఫరల్ వ్యవస్థ, అమలు వ్యూహాలు, నైతిక ప్రమాణాలు, తదితర అంశాలపై నిపుణులు చర్చించి పలు సూచనలు చేశారు.

విద్యార్థుల మానసిక ఆరోగ్యం ముఖ్యం – సమగ్ర శిక్ష అదనపు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.ఆర్. ప్రసన్న కుమార్

సమగ్ర శిక్ష అదనపు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ ఎం.ఆర్. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తున్న కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఒక కీలక కార్యక్రమంగా నిలుస్తుందన్నారు. విద్యార్థుల్లో స్వీయ అవగాహన పెంపొందించడం, వారి ప్రతిభ, ఆసక్తులకు అనుగుణంగా కెరీర్‌ను ఎంపిక చేసుకునేలా మార్గనిర్దేశం చేయడం, మానసిక సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన సహాయాన్ని అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో నిపుణులు అందించే సూచనలు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న కార్యక్రమానికి బలమైన పునాదిగా నిలుస్తాయని, ఉపాధ్యాయులు, కౌన్సెలర్లకు శిక్షణ, డిజిటల్ అసెస్‌మెంట్ వ్యవస్థ, పర్యవేక్షణ విధానాల రూపకల్పనలో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు మెరుగైన కెరీర్ మార్గదర్శకత్వం, మానసిక ఆరోగ్య సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అనంతరం సైకోమెట్రిక్ టూల్, ఎస్ఓపీ రూపొందిస్తున్న నిపుణుల బృందంతో కలిసి చర్చించారు.

ఈ వర్క్‌షాప్‌లో నిమ్ హాన్స్ (NIMHANS), ఎయిమ్స్ (AIIMS), ఇండ్లాస్ (INDLAS), పడాల ఛారిటబుల్ ట్రస్ట్, ఎస్‌సీఈఆర్‌టీ నిపుణులు, ఆర్‌ఐఈ నెల్లూరు, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, యూనిసెఫ్ ప్రతినిధులు, సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ అధికారులు, జిల్లా జీసీడీవోలు, సైకాలజిస్టులు, విద్యావేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *