-చంద్రబాబు ఈవెంట్ మేనేజర్ గా మారటం తగదు.
-సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఉద్యమ నేతలపై అక్రమ కేసులు బనాయించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సిద్ధపడటం దుర్మార్గమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా దుయ్యబట్టారు. గ్రాఫ్ పడిపోయిన మోడీ అడుగులకు మడుగులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవెంట్ మేనేజర్ గా మారటం తగదని హితవు పలికారు.
ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ ఉద్యమం ముగిసిన తర్వాత నేడు విద్యార్థి నాయకులు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్లందర్నీ వెంటాడి, వేటాడి రకాల కేసుల్లో ఇరికించడానికి, పాత కేసులు తిరగదొడటానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే సాక్షాత్తు ఢిల్లీలో సిపిఎం కేంద్ర కార్యాలయంపైన కూడా ఢిల్లీ పోలీసులు దాడి చేయడాన్ని సిపిఐ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయేతర పక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజాతంత్ర వాదులు అందరు కూడా ఈ దాడిని ఖండించాలని కోరుతున్నాం. రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేసేందుకు పోలీసులు తెగబడుతున్నారంటే ఇది కచ్చితంగా మోడీ, అమిత్ షాలు పన్నిన కుట్రగా గోచరిస్తున్నది. ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి, ప్రతికార చర్యలు చేపట్టడానికి మోడీ, అమిత్ షాలు ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకు ఏబీవీపీలో పనిచేసే పైకి వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉంటే, ఇప్పుడు సాక్షాత్తు పక్కా ఆర్ఎస్ఎస్ వాది చేతిలో కేంద్ర విద్యా శాఖను పెట్టారు. దేశవ్యాప్తంగా విద్యను కాషాయీకరణ, కార్పొరేటీకరణ చేసేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోంది. కనీసం ఎన్డీఏలో లౌకిక పార్టీలైన టిడిపి, జెడియు లాంటి పార్టీలకు కేంద్ర విద్యా శాఖను అప్పగిస్తే బాగుండేది. ఆర్ఎస్ఎస్ నిక్కర్ వాలాకు కేంద్ర విద్యా శాఖను అప్పగించి విద్యా శాఖను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం చూడటం దుర్మార్గం.
ఏపీలో చంద్రబాబు నాయుడు ఏ గోడయితే పగలగొడతా ఉంటారో ఆ గోడ కింద తల దాచుకునేందుకు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయి ఇబ్బందుల్లో ఉంటే, ఆయన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి తీసుకొచ్చి ఏపీలో 2 లక్షల మందితో మీటింగ్ పెడతామని చెప్పడం సరైనది కాదు. గతంలో ఎన్ని ప్రారంభోత్సవాలు జరిగినప్పటికీ ఏనాడు లక్షల సంఖ్యలో జన సమీకరణ చేయలేదు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా జన సమీకరణ చేయలేదు. నేడు గ్రాఫ్ పడిపోయిన మోడీని తీసుకురావడం అంటే పంచరైన టైర్ కి గాలి కొట్టడం లాంటిదే. కేవలం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. నరేంద్ర మోడీతోపాటు చంద్రబాబు కూడా మునిగే నావ ఎక్కుతున్నారు. విద్యార్థి, యువజనులు మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేడు మోడీ అంటే భయపడే స్థితిలో దేశంలో ఎవరూ లేరు. కానీ మోడీని ప్రసన్నం చేసుకొని తద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇది సరైనది కాదు.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కోసం లక్షలాదిమంది జన సమీకరణ, కోట్లాది రూపాయల ఖర్చు పెట్టడం సరైనది కాదు. వృధా వ్యయంతో ప్రజలపై భారాలు మోపుదామనుకుంటే ప్రజలు కూడా హర్షించరు. చంద్రబాబు నష్టపోక తప్పదు. మొదట్లో మామూలుగానే ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అదే నిజమైతే ఇంతకన్నా ఘోరమైన తప్పిదం మరొకటి ఉండదు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో లక్షలాది మందిని సమీకరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోడీ చేతుల్లో పావుగా మారారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కోట్లాది రూపాయల వృధా వ్యయం చేసి మరింత అప్పుల్లోకి నెట్టడానికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిని రాష్ట్ర ప్రజలంతా తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం. చంద్రబాబు ఈవెంట్ మేనేజర్గా మారవద్దని హితవు పలుకుతున్నాం.
Prajavartha Online Telugu News