-విద్యార్థుల ఉద్యమంపై విష ప్రచారం ఆపాలి
-అసత్య ప్రచారం చేస్తున్న యÖట్యూబర్లపై కేసులు పెట్టాలి
-బిజెపిలోని 39 శాతం క్రిమినల్ ఎంపీలపై చర్యలేవీ?
-ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి,
-నీట్ బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి
-రాష్ట్రంలో కరువు విలయతాండవం
-56 శాతం లోటు వర్షపాతంతో రైతుల్లో ఆందోళన
-రాష్ట్రంలో కరువు, వర్షాభావ ప్రాంతాల్లో సిపిఐ పర్యటన, ఆందోళన
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా సాగిన విద్యార్థి, యువజన ఉద్యమాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ నాయకులు, మోదీ అనుకూల మీడియా, సామాజిక మాధ్యమాలు సాగిస్తున్న విషప్రచారంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. విద్యార్థి ఉద్యమాన్ని వక్రీకరిస్తూ అసత్యాలు ప్రసారం చేస్తున్న యÖట్యూబర్లు, బిజెపి అనుకూల సోషల్‌మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను గట్టర్ జనరేషన్ (మురికి కాల్వల తరం)గా అవమానిస్తూ వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడ దాసరి భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, యువజనులు నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా 45 రోజులపాటు ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్వహించారని తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాయని, విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం చర్చలకు రావాల్సి వచ్చిందన్నారు. ఉద్యమ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడం, నీట్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం వంటి ప్రధాన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ, ఇప్పటివరకు వాటి అమలులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల ఉద్యమాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నాయకులు, మోదీ అనుకూల మీడియా అసత్య ప్రచారాన్ని ముమ్మరం చేయడం దుర్మార్గమని అన్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విద్యార్థుల ఉద్యమాన్ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామిక విలువలను కించపరచడమేనని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రజా ఉద్యమాలను అవహేళన చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు.
విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న వారిలో 2,873 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చూపిస్తూ ఉద్యమాన్ని అపఖ్యాతిపాలు చేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటే, కేసులు నమోదైన వారి సంఖ్య కేవలం 1.4 శాతం మాత్రమేనని విశ్లేషించారు. అదే సమయంలో లోక్‌సభలోనే గణనీయమైన సంఖ్యలో 46 శాతం క్రిమినల్ రికార్డులు కలిగి ఉన్న వారున్నారని తెలిపారు. అందులో అందులో బీజేపీ నుంచి గెలిచిన 240 మంది ఎంపీలలో 94 మందిపై అనగా 39 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 63 మందిపై అనగా 26 శాతం తీవ్రమైన కేసులు నమోదయ్యాయని తెలిపారు. కంగనా రనౌత్‌పై మండిలోను 8 క్రిమినల్ కేసులు నమోదైన విషయాన్ని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులు ఉన్న వారిలో ఈటెల రాజేందర్‌పై 45, బండి సంజయ్‌కుమార్‌పై 42, రఘునందన్‌రావుపై 29, సీఎం రమేశ్‌పై 5 కేసులు నమోదయ్యాయని తెలిపారు. విద్యార్థులను ప్రశ్నించే ముందు తమ పార్టీ ప్రజాప్రతినిధుల పరిస్థితిపై బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు బీజేపీ నాయకులపైనా అనేక కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.
విద్యార్థి ఉద్యమం దేశ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత ముందుకు వచ్చి చేపట్టిన ఉద్యమాలను అవమానించడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమేనన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ఎవరు వస్తారనే అంశంపై మోదీ అనుకూల మీడియా చేస్తున్న ఊహాగానాలను కూడా ఆయన కొట్టిపారేశారు. వ్యక్తులు మారడం వల్ల ప్రజావ్యతిరేక విధానాలు మారవని, ప్రజల సమస్యలను పట్టించుకోని ఏ ప్రభుత్వం అయినా ప్రజా ఉద్యమాల ఎదుట నిలవలేదని చరిత్ర చెబుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన శక్తి మరింత ఐక్యంగా ముందుకు వస్తుందని నొక్కిచెప్పారు. జంతర్ మంతర్ వద్ద ఉద్యమిస్తున్న విద్యార్థులకు విదేశాల నుంచి నిధులు, ఆహారం అందుతున్నాయంటూ బీజేపీ అనుకూల మీడియా, వర్గాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆయన స్పష్టంచేశారు. ప్రజా ఉద్యమాలను అపఖ్యాతిపాలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
నీట్ లీక్ అంశంపై రాజీనామా చేసిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు మద్దతుగా కొందరు చేస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. విద్యా వ్యవస్థలో ఆరెస్సెస్ భావజాలాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాలు, విద్యను కాషాయీకరణ చేసే చర్యలే దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయని చెప్పారు. విద్య రాజ్యాంగ విలువల ఆధారంగా, శాస్త్రీయ దృక్పథంతో కొనసాగాలని, మతపరమైన, రాజకీయ భావజాలాల ఆధీనంలోకి వెళ్లకూడదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని, నీట్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, విద్యా వ్యవస్థలో సమగ్ర ప్రజాస్వామ్య సంస్కరణలు చేపట్టాలని కోరారు. ఈ హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైతే దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన ఉద్యమాలకు సీపీఐ సంపూర్ణ మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు.
వాట్సాప్ యూనివర్సిటీ కుట్రలు చేస్తూ నిరుద్యోగం, విద్యా రంగానికి సంబంధించిన అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకే నిరాధార ప్రచారాలకు తెరలేపింది నిజంకాదా? అని ప్రశ్నించారు. విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమకారులపై సాగుతున్న దుష్ప్రచారాన్ని వెంటనే నిలిపివేసి, విద్యా రంగంలోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు రోజురోజుకూ విషమిస్తున్నాయని ఈశ్వరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ఈ సీజన్లో నమోదుకావాల్సిన వర్షపాతంతో పోలిస్తే భారీ లోటు ఏర్పడిందని, రాష్ట్రవ్యాప్తంగా 56 శాతం వర్షాభావం నమోదైందన్నారు. కేవలం 16 లక్షల ఎకరాల్లోనే రైతులు విత్తనాలు నాటే పరిస్థితి వచ్చిందన్నారు. వందలాది మండలాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటుండగా, అనేక మండలాలు తీవ్ర కరువు పరిస్థితుల్లోకి వెళ్లాయని తెలిపారు. వర్షాభావం కారణంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందని, రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రభావిత ప్రాంతాలను ప్రకటించి, ప్రత్యేక సహాయ ప్యాకేజీ అమలు చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద విస్తృతంగా పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సంక్షోభంతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, పంట భీమా నమోదు గడువును రైతుల ప్రయోజనాల దృష్ట్యా పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని కరువు పీడిత, వర్షాభావ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సిపిఐ శ్రేణులు పర్యటించాలని, ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. హరినాథ్‌రెడ్డి, పి. దుర్గాభవాని, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News