-గన్నవరం అంటే అంతర్జాతీయ విమానాశ్రయం, హెచ్‌సీఎల్, ఉపాధి అవకాశాలకు కేంద్రం: ఎమ్మెల్యే
-రెండేళ్లలో గన్నవరం టౌన్‌లో రూ.89 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం: యార్లగడ్డ
-విజయవాడ రూరల్ 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయాల్సిందే: ఎమ్మెల్యే
-9 గ్రామాల తాగునీరు, చెత్త సమస్యలకు వీఎంసీ విలీనమే శాశ్వత పరిష్కారం
-9 గ్రామాల వీఎంసీ విలీనం కోసం సీఎం చంద్రబాబును మరోసారి కలుస్తా: యార్లగడ్డ
-గత 30 రోజుల్లో గన్నవరం నియోజకవర్గానికి దాదాపు రూ.100 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు అయ్యాయి
-గన్నవరాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: యార్లగడ్డ
-టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోంది: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం గౌడపేట 128, 129 బూత్‌ల పరిధిలో గురువారం నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం’ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో చేపట్టిన పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అంతకుముందు రూ.27 లక్షల వ్యయంతో నిర్మించిన గౌడపేట అంతర్గత సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గన్నవరం అభివృద్ధిని పక్కనపెట్టి కొంత మంది కేవలం ప్రతికూల అంశాలనే ప్రచారం చేయడం సరికాదన్నారు. గన్నవరం అంటే కేవలం వివాదాలు కాదని, అంతర్జాతీయ విమానాశ్రయం, హెచ్‌సీఎల్ సంస్థ, వేలాది ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు కూడా గుర్తుకు రావాలని అన్నారు. గన్నవరం సెంటర్‌లో మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలతో కూడిన సుందరీకరణ పనులు చేపట్టామని, రహదారి విస్తరణతో పట్టణ రూపురేఖలు మారాయని తెలిపారు. త్వరలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. గన్నవరం చారిత్రక, రాజకీయ ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గమని, పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమని గుర్తుచేశారు. అలాంటి నియోజకవర్గాన్ని వెనుకబడిన ప్రాంతంగా చూపించే ప్రయత్నాలు సరికావన్నారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధిని రెండేళ్లలోనే చేసి చూపించనాని పేర్కొన్నారు. గన్నవరం పట్టణంలోనే సుమారు రూ.89 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రహదారి విస్తరణ, విద్యుత్ వ్యవస్థ ఆధునికీకరణ, పారిశుధ్య నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలు చేశామని చెప్పారు. గౌడపేట, సాలిపేట, చెంచుల కాలనీ, కేసరపల్లి, వీఎన్‌పురం కాలనీల్లో విద్యుత్ స్తంభాల పునర్వ్యవస్థీకరణతో పాటు విద్యుత్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.31.40 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. గతంలో గన్నవరం పరిసర ప్రాంతాల్లో చెత్త సమస్య తీవ్రంగా ఉండేదని, ప్రజల సహకారంతో శాశ్వత పరిష్కారం చూపించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో డంపింగ్ యార్డ్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. గన్నవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి సీఎస్‌ఆర్ నిధుల ద్వారా రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. గతంలో కనీస సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఆసుపత్రిలో సౌకర్యాల పెంపుపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హెచ్‌సీఎల్ సహకారంతో ఆసుపత్రులు, పాఠశాలలు, బాలికల మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హెచ్‌సీఎల్ నిధులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా నియోజకవర్గంలోనే వినియోగించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంటింటికీ వెళ్లి రక్తపరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాలు ఇప్పటికీ అధిక టిడిఎస్ ఉన్న నీటిని తాగాల్సిన పరిస్థితి ఉందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాల్లోని ప్రజలు తాగునీరు, చెత్త, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడమేనని స్పష్టం చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశానని, త్వరలో కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ మున్సిపల్ ఎన్నికలకు ముందే ఈ తొమ్మిది గ్రామాలను వీఎంసీలో విలీనం చేయాలని కోరతానన్నారు. సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పోలవరం–ఏలూరు కాలువ అనుసంధాన పనులు కూడా త్వరలో పూర్తి కానున్నాయని చెప్పారు. ఈ పనులు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని వివరించారు. గత 30 రోజుల్లోనే గన్నవరం నియోజకవర్గానికి దాదాపు రూ.100 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారం, సాగునీటి సౌకర్యాల కల్పన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహకారంతో గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News