విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రహదారులన్నీ పరిశుభ్రంగా ఉండాలని, విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ ఎ. రవీంద్రరావు అన్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని బాలాజీనగర్, స్క్రూ బ్రిడ్జి, మధురానగర్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారులు, కాలువలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని, చెత్త పేరుకుపోకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య పనులు నాణ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం బాపనయ్య నగర్ సాయిబాబా ఆలయం సమీపంలోని అన్నా క్యాంటీన్‌ను పరిశీలించారు. క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ, తాగునీటి సదుపాయం, లబ్ధిదారులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆహార నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని, క్యాంటీన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా సేవలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జ్ డాక్టర్ గోపాల నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News