విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ రీజినల్ ఫైర్ ఆఫీసర్ రత్నబాబు ఆధ్వర్యంలో ఎం.జి.రోడ్డులోని ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్‌లో శుక్రవారం ఉదయం ఆకస్మిక అగ్నిమాపక భద్రతా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా భవనంలో ఏర్పాటు చేసిన పలు అగ్నిమాపక పరికరాలు సక్రమంగా పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా రీజినల్ ఫైర్ ఆఫీసర్ రత్నబాబు మాట్లాడుతూ, ప్రజలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగించే వాణిజ్య సముదాయాలు, షోరూములు, షాపింగ్ మాల్స్‌లో అగ్నిమాపక భద్రతా పరికరాలు ఎల్లప్పుడూ పనిచేసే స్థితిలో ఉండాలని తెలిపారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడంలో అగ్నిమాపక పరికరాల నిర్వహణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. తనిఖీలలో గుర్తించిన లోపాలను ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి, పని చేయని అగ్నిమాపక పరికరాలను వెంటనే మరమ్మతులు చేయించి పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని అగ్నిమాపక వ్యవస్థలను నిర్వహించాలని సూచిస్తూ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, వీఎంసీ ఫైర్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News