Breaking News

ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారిద్దాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం కర్మనగర్, కరెన్సీ నగర్, శ్రీ రామచంద్ర నగర్ ప్రాంతాల్లో బయాలజిస్ట్ సూర్యకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి నీరు నిల్వ ఉండే ప్రదేశాలను పరిశీలించి దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ మాట్లాడుతూ నగరంలో దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు ప్రధాన కాలువల్లో పూడిక తొలగింపు, ఫాగింగ్, యాంటీ లార్వల్ ఆపరేషన్లు, ఎంఎల్ ఆయిల్ స్ప్రేయింగ్, గాంబూసియా చేపల విడుదల వంటి శాస్త్రీయ చర్యలను నిరంతరం అమలు చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా లార్వా నిర్మూలన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ప్రతి కుటుంబం వారానికి ఒకరోజు, ముఖ్యంగా ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించి ఇంటి ఆవరణలో, డాబాపై, పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. వాడుకలో లేని బకెట్లు, డ్రమ్‌లు, పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, టైర్లు, కూలర్లు, ఫ్రిజ్ ట్రేలు తదితర పాత్రల్లో నిల్వ ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలని తెలిపారు. కేవలం ఐదు నుంచి ఏడు రోజుల పాటు నిల్వ ఉన్న నీటిలోనే దోమల లార్వా అభివృద్ధి చెందుతుందని, ప్రతి వారం నీటి నిల్వలను తొలగించడం ద్వారా దోమల వ్యాప్తిని గణనీయంగా నియంత్రించవచ్చని వివరించారు.

మరోవైపు ప్రధాన కాలువల్లో ట్రాక్టర్ ఆధారిత ప్రత్యేక యంత్రాలు, బోట్ల సహాయంతో గుర్రపు డెక్కలు, చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని తెలిపారు. దీంతో కాలువల్లో నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండటంతో పాటు దోమల ఉత్పత్తి తగ్గి, వాటి ద్వారా వ్యాపించే వ్యాధులను సమర్థవంతంగా నియంత్రిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మలేరియా విభాగం సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *