Breaking News

రెక్కలు విప్పిన ఉత్తరాంధ్ర

-అల్లూరి విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు
-తెలుగు కళలు, సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయ ప్రాంగణం
-గిరిజన సంప్రదాయ నృత్యం థింసాకు గిన్నీస్ వరల్డ్ రికార్డు
-ఉత్తరాంధ్ర ఆర్ధిక ప్రగతికి ఊతమిచ్చేలా కార్యకలాపాలు ఉండాలన్న సీఎం
-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమీక్షించిన సీఎం చంద్రబాబు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ విమానాశ్రయాన్ని ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్ గా తీర్చిదిద్దాలని సూచించారు. ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేలా కార్యక్రమం నిర్వహించాలని సీఎం సూచించారు. విశాఖలోని పోర్టు గెస్ట్ హౌస్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలుగు కళలు, సంస్కృతీ వారసత్వ వైభవాన్ని చాటేలా విమానాశ్రయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ, సంప్రదాయాలు, కళలు ఉట్టిపడేలా అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అలంకరించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విమానాశ్రయ స్వాగత ద్వారం వద్ద ఆకట్టుకునేలా భారీ స్థాయి ఏటికొప్పాక కళాకృతి ఏర్పాటు చేశామన్నారు. విమానాశ్రయ ప్రాంగణం లోపల ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి అద్దం పట్టేలా తోలు బొమ్మలు, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది చిత్రాలతో పాటు భౌగోళిక వారసత్వాన్ని చాటే బంగినపల్లి మామిడి లాంటి చిత్రాలను అలంకరించామని సీఎంకు వివరించారు. ప్రత్యేకించి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేలా 13,500 మంది గిరిజన మహిళలతో థింసా నృత్యాన్ని కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. రిహార్సల్ గా చేసిన ఈ నృత్యానికి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సాధించినట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అలాగే విమానాశ్రయంలో దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే వాల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విమానాల రాకపోకలు, సర్వీసుల వివరాలు తెలియచేసేలా ప్రయాణికుల కోసం ఎల్ఈడీ వాల్ ను ఏర్పాటు చేసినట్టు సీఎంకు వివరించారు.

ప్రధానికి గిరిజన థింసా నృత్యంతో ఘన స్వాగతం

ఉదయం 10.45 గంటలకు ఢిల్లీ నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీకి… రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తదితరులు స్వాగతం పలకనున్నారు. అనంతరం 10.58 గంటలకు ప్రధాని ఎయిర్ పోర్టు టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. దాదాపు 12 నిముషాల పాటు టెర్మినల్ భవనంలో గడపనున్నారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన తెలుగు కళాకృతులు, సంస్కృతీ వారసత్వ వైభవాన్ని చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన చిత్రాలను ప్రధాని తిలకించనున్నారు. టెర్మినల్ భవనం నుంచి బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకునే సమయంలో ప్రధాని మోదీకి గిరిజన సంప్రదాయ నృత్యం థింసాతో మహిళలు, బాలికలు ఘన స్వాగతం పలకనున్నారు. ఏక రూప దుస్తులు ధరించిన గిరిజన మహిళలు, బాలికలు థింసా నృత్యంతో ప్రధానికి, ఇతర అతిథులకు విశిష్టమైన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం బహిరంగ సభా వేదిక ప్రాంగణానికి చేరుకోనున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సుకు మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, పి.నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ సహా ఇతర ప్రజాప్రతినిధులు, సీఎస్ సాయి ప్రసాద్, ఐ అండ్ ఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *