-“ఇంటింటికీ టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమం ఐదో రోజూ విజయవంతం
-ఐదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల ఇళ్లను సందర్శించిన కూటమి నాయకులు, కార్యకర్తలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇంటింటికీ టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఐదో రోజూ విజయవంతంగా కొనసాగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఇంటింటికీ వెళ్లి రెండేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
నేడు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.80 లక్షల ఇళ్లను సందర్శించిన కూటమి శ్రేణులు, గత ఐదు రోజుల్లో మొత్తం 12 లక్షల ఇళ్లకు చేరుకుని ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించారు. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలను ప్రజలకు వివరించగా, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు.
పార్టీ శ్రేణులను అభినందించిన నారా లోకేష్
“ఇంటింటికీ టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్న నాయకులు, కార్యకర్తలను యువనేత, మంత్రి నారా లోకేష్ నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న వారికి వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్ల ద్వారా అభినందనలు తెలియజేయడంతో పాటు, పలువురితో నేరుగా ఫోన్లో మాట్లాడి వారి సేవలను ప్రశంసిస్తున్నారు. పార్టీ శ్రేణులు ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో ప్రతి ఇంటికీ చేరుకుని కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత విస్తృతంగా వివరించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News