Breaking News

కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వకపోతే ఉద్యమిస్తాం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా డెల్టాలో వరి పంటకు తక్షణమే సాగునీరు విడుదల చేసి పంటలను రక్షించాలని రైతునేతలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సకాలంలో సాగునీరివ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు .కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని వరి సాగు చేస్తున్న రైతాంగాన్ని ముఖ్యంగా 90% పైగా ఉన్న కౌలు రైతులను ప్రభుత్వం తీవ్ర గందరగోళంలోకి నెట్టి వేసిందని, మే 1 నాటికి ఖరీఫ్ సీజన్ ప్రారంభించి నీళ్లు ఇస్తామని, నారుమళ్లు సిద్ధం చేసుకోవాలని,ఏరువాక పండగ చేసుకోవాలని ప్రసార మాధ్యమాల ద్వారా కూటమి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసి ఇప్పుడేమో నీళ్ళు లేవు వరి సాగు చేయవద్దని చెప్పటం చాలా దుర్మార్గమని ధ్వజమెత్తారు.
గత సంవత్సరమే ఆగస్టు నుంచి రాబోయే ఖరీఫ్ సీజన్ లో ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడం దుర్మార్గమన్నారు. ముందస్తుగా ప్రణాళికలు చేసుకోకపోవడం ఈరోజు కృష్ణా డెల్టా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని దీనికి రాష్ట్రప్రభుత్వ విధానాల వైఫల్యమే కారణమేన్నారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షతన విజయవాడలోని దాసరి నాగభూషణరావు భవన్ లో నందు కృష్ణా డెల్టాలోని వరి పంటకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ హామీని నమ్మి పెట్టుబడులు పెట్టిన రైతులకు సాగునీరు రేపు మాపు అంటూ తేదీలను పొడిగిస్తూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని వరిసాగుకు నీరు ఇవ్వలేమని చెప్పటం రైతాంగాన్ని మోసగించడమేన్నారు. డెల్టా స్థిరీకరణకు సాగునీరివ్వటం కోసం ఏర్పాటు చేసిన పులిచింతల, పట్టిసీమ నీళ్లు వృధా చేసి ఇప్పుడు నీళ్లు లేవు అని చేతులెత్తేయటం సరైంది కాదని ధ్వజమెత్తారు. వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం వి ఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పట్టిసీమ నీళ్లు, పైన నుంచి కృష్ణా నదిలోకి వస్తున్న నీటితో వరి పంట సాగు చేయవచ్చని కానీ ప్రభుత్వం అనాలోచితంగా వరి సాగు చెయ్యొద్దని చెప్పటం అవగాహన రహిత్యమన్పారు. తక్కువ నీరు ఉన్న సమయంలో కూడా వరి పండించిన అనుభవాలు ఉన్నాయని వీటిని విస్మరించడం బాధాకరమన్నారు. ఆలోచన పరుల వేదిక కన్వీనర్ రిటైర్డ్ డిజిపి ఏబీ వెంకటేశ్వరావు మాట్లాడుతూ కృష్ణా డెల్టాలో వరి సాగు చేసే రైతులకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం, పంట కాలవల తవ్వకం, ఇప్పటికే ఉన్న పంట కాలవల్లో పూడికలు తీయటం, మరమత్తులు నిర్వహించడం తదితర పనులు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎగువ ప్రాంతాల్లో కృష్ణా నదిపై ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం గుడ్లప్పగించి చూడటం అన్యాయన్నారు.కృష్ణా నది నీటిపై ఆంధ్రప్రదేశ్ గల హక్కులను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహారిస్తోందనన్నారు.
కూటమి సర్కార్ నీటి హక్కులు కన్నా రాజకీయాలకే ప్రాముఖ్యత ఇస్తున్నదని భవిష్యత్తులో కృష్ణా నది నీరు మన రాష్ట్రానికి అందకుండా పోయే ప్రమాదాలు ఏర్పడబోతున్నాయని కృష్ణానదిలో ఉన్న నీటి హక్కుల కోసం వాటి పరిరక్షణ కోసం రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ ప్రత్యామ్నయం చూపించకుండా వరి పంట వేయొద్దని రైతులను నట్టింట ముంచటం సరికాదని ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర నాయకులు అన్నాబత్తుల శివకుమార్ మాట్లాడుతూ పశ్చిమ కృష్ణా డెల్టాలో సుమారు 5 నుంచి 6 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వరి పంట వేయ్యకపోతే ఏ పంటను పండించి బతకాలో తెలియని దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉందన్నారు.
అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ మాట్లాడుతూ కృష్ణా నదికి చివర ఆయకట్టు ప్రాంతమైన దివిసీమలో నీరు అందక రైతాంగం నష్ట పోతున్నారని ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరందగ్గర,బొబ్బర్లంక దగ్గర రెండు బ్యారేజీలు నిర్మిస్తే డెల్టా ప్రాంతానికి సాగునీటి సమస్య ఉండదని ఆ రెండు బ్యారేజీలు నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లమల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొల్లా రాజమోహన్ మాట్లాడుతూ డెల్టా స్థిరీకరణ కోసం ఏర్పాటుచేసిన పులిచింతల, పట్టిసీమలో నీళ్లు ఉన్నప్పటికీ సాగుకు నీరు ఇవ్వలేమని చెప్పటం రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు డెల్టా రైతాంగానికి నీరు ఇవ్వటం కోసమే పులిచింతల ప్రాజెక్టు నిర్మించారని , ఆ తర్వాత పట్టిసీమ ఏర్పాటు చేశారని ఈ రెండిట్లో నీరు ఉన్నా డెల్టా రైతులను ఆదుకోవడంలో విఫలం అవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య తీర్మానం ప్రవేశ పెడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించి కృష్ణా డెల్టా రైతులకు సాగు నీరు అందించక పోతే ఉద్యమిస్తామన్నారు.
బోర్లు సౌకర్యం ఉండి నాట్లు వేసుకున్న రైతులకు విద్యుత్ కనెక్షన్లతో నిమిత్తం లేకుండా నిరంతరాయంగా ఉచిత కరెంటు అందించాలని, విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో పంటలను కాపాడుకోవడానికి వీలుగా రైతులకు సబ్సిడీ డీజిల్ పంపిణీ చేయాలని, వర్షాభావ మరియు సాగునీటి కొరత వలన నష్టపోయిన రైతులకు తక్షణమే ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని ,రైతులపై భారం మోపకుండా పాత పద్ధతిలో ఉచిత పంటల భీమా పథకాన్ని పునద్దరించాలని, ప్రీమియం మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలని ఆదుకోవాలన్నారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి శంకర్, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కే.పోలారి ,ఎస్ యు సి ఐ రాష్ట్ర నాయకులు కే. సుధీర్, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం. రామకృష్ణ, నవ్యాంధ్ర రైతు కూలీ సంఘం రాష్ట్ర కన్వీనర్ మన్నవహరి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడి యలమందరావు, అఖిల భారతరైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు ఎస్ వి వి సత్యనారాయణ, జాగృతి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరీదు ప్రసాద్, రైతుకూలీ సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాయకులు సింగోతు నాగేంద్రరావు, ప్రొఫెసర్ విశ్వనాథం, కాంగ్రెస్ కిసాన్ విభాగం రాష్ట్ర నాయకులు తుమ్మల నాగేశ్వరావు, సిపిఐ కార్యవర్గ సభ్యులు నార్ల వెంకటేశ్వరరావు, కృష్ణాజిల్లా సిపిఐ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి చుండూరు సుబ్బారావు, ఎన్టీఆర్ జిల్లా కౌలురైతుల సంఘం అధ్యక్షులు బుడ్డి రమేష్, గుంటూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి ,బాపట్ల జిల్లా రైతు సంఘం నాయకులు సూర్యనారాయణరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి వల్రాజు, బి. నాసర్ జి,ఐప్సోరాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంకాళి సుబ్బారావు, ఇన్సాప్ రాష్ట్ర అధ్యక్షులు అప్సర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *